05-02-2026 12:56:48 AM
వచ్చే నెలలోనే పెళ్లి..
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ ఆందోళన
నిందితులను వదలం: డీసీపీ యోగేష్ గౌతమ్
మొయినాబాద్, ఫిబ్రవరి 4: భూమి కోసం చెల్లిని గొంతుకోసి కిరాతకంగా అంతమొందించాడు ఓ అన్న. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో చెల్లికి ఎక్కువ ఇచ్చారన్న కోపంతో కడతేర్చాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయి నాబాద్ మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లిలో బుధవారం జరిగింది. కేతిరెడ్డిపల్లికి చెందిన వెంకటమ్మకు ఇద్దరు కూమార్తెలు, కుమారుడు రాజు ఉన్నారు.
పెద్ద కుమార్తెకు వివా హం కాగా చిన్నకూతురు స్వప్న (34) చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నది. వచ్చే మార్చిలోనే ఆమె పెళ్లి జరగాల్సి ఉం ది. అయితే వెంకటమ్మ తమకున్న 10 ఎకరాల భూమిలో రాజుకు 6 ఎకరాలు, ఇద్ద రు కుమార్తెలకు రెండు ఎకరాల చొప్పున ఇచ్చేలా గతంలో పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది. స్వప్న పెళ్లి అయిన తర్వాత ఆ భూమిని ఇద్దరు అక్కా చెళ్లెల్లు పంచుకునేలా ఒప్పందం జరిగింది.
అయి తే, చెల్లికి ఎక్కువ భూమి ఇచ్చారన్న అక్కసుతో రాజు గత కొంతకాలంగా గొడవప డుతున్నాడు. బుధవారం ఉదయం తన భూమిని సర్వే చేయించేందుకు స్వప్న తన తల్లితో కలిసి పొలానికి వెళ్లింది. ఆ సమయంలోనే పథకం ప్రకారం వచ్చిన రాజు, మరొక వ్యక్తితో కలిసి ఒక్కసారిగా దాడి చేశాడు. తొలుత తలపై రాయితో కొట్టి, ఆపై వెంట తెచ్చుకున్న కత్తితో స్వప్న గొంతు కోసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన స్వప్న ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది.
ముందే తెలిసినా పట్టించుకోని పోలీసులు?
తన ప్రాణాలకు ముప్పు ఉన్నదని స్వప్న గతంలోనే రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు సరైన భద్రత కల్పించలే దంటూ చేవెళ్ల బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి న్యాయవాది హత్యకు నిరసనగా బార్ అసోసియేషన్ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎస్సైకి డీసీపీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
నిందితులను వదలం: డీసీపీ
ఘటనా స్థలాన్ని పరిశీలించిన చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. భూ వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణమని తెలిపారు. ‘నిందితుడు రాజును, అతనికి సహకరించిన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లి వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోతుగా విచారణ జరుపుతున్నాం’ అని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్త ఆందోళనకు న్యాయవా దుల పిలుపు ‘నిజమైన బాధితులకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. న్యాయవాదుల రక్షణ కోసం వెంటనే ’అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ తీసుకురావాలి‘ అని హైకోర్టు మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘునాథ్ డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు.