12 July, 2026 | 2:53 AM

కొలువుదీరిన గుట్ట పాలక మండలి

12-07-2026 01:49 AM
  1. ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం 
  2. సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన విజయక్రాంతి దినపత్రిక ఎండీ విజయరాజం
  3. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు

యాదగిరిగుట్ట, జూలై 11 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా మన్నె సత్యనారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

పాలక మండలి సభ్యులుగా కొణిదెల సురేఖ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, విజయక్రాంతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ చిలప్పగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వా తి కంఠమనేని, ఎం రాఘవేంద్ర, డీ లక్ష్మినారాయణ నాయక్ ప్రమాణం చేశారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు, వైటీడీఏ ఉపాధ్యక్షులు జీ కిషన్‌రావు, దేవస్థానం కార్యని ర్వాహణాధికారి జై భవాని శంకర్, దేవస్థానం ప్రధాన అర్చకులు కే వెంకటాచా ర్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడు తూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని ఆధ్యాత్మికంగా, భక్తులకు మెరుగైన వసతులతో పాటు త్వరితగతిన దర్శనాలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ట్రస్ట్ బోర్డ్ సభ్యులకు సూచించారు. దేశ విదేశాలు, రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులకు స్వామి వారి దర్శనానికి వస్తున్నారని, వారి కోసం మరింత మెరుగైన వసతు లు కల్పించేందుకు కృషి చేయాలని అన్నారు. 

టీటీడీ తరహాలో అభివృద్ధి చేస్తాం: చైర్మన్ సత్యనారాయణరెడ్డి

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం యాదగిరిగుట్ట దేవస్థాన అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం యాదగిరిగుట్ట ప్రెసిడెన్సి సూట్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టను ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పాలకమండలి సభ్యులు కృషి చేస్తారని చెప్పారు.

భక్తులకు మెరుగైన వసతులతో పాటు త్వరితగతిన దర్శనాలు అ య్యే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో యాదగిరి క్షేత్రాన్ని 80 లక్షల నుంచి కోటి మంది దర్శ నం చేసుకుంటున్నారని వీరికి ప్రత్యేక వసతు లు కల్పిస్తామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు యాదగిరిగుట్టను ఆధ్యాత్మిక మహిమాన్విత క్షేత్రంగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. యాదగిరిగుట్ట క్షేత్రంలో పారిశుద్ధ్య పనులు, నీటి వసతులు, బస పైన ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, దేవాదాయ డైరెక్టర్ హనుమంతరావు, కార్యనిర్వాహణాధికారి జే భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.