20 May, 2026 | 1:52 AM

మరణంలోనూ వీడని భార్యాభర్తల బంధం

20-05-2026 12:41 AM
  1. శుభకార్యానికి వెళ్తూ దంపతుల దుర్మరణం
  2. జిల్లా ఏజెన్సీలో విషాదం

ఉట్నూర్, మే 19 (విజయక్రాంతి): అగ్ని సాక్షిగా... ఏడు అడుగులు నడిచి... నిండు నూరేళ్లు తోడు నీడగా ఉంటామని బాస  చేసిన భార్యాభర్తల బంధం మరణంలోనూ వీడలేదు. తమ కుటుంబంలో జరిగే ఓ శుభకార్యానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలో చోటుచేసుకుంది.

పోలీసులు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...  గుడిహత్నూర్ మండలం తోషం పంచాయతీ పరిధిలోని తోయా గూడా గ్రామానికి చెందిన  పేందూరు షేకు బాయి, పేందూరు లక్ష్మణ్  భార్యాభర్తలు ఇద్దరు తన అన్న కొడుకు పెళ్లి కొరకు తోయాగూడా నుండి ద్విచక్ర వాహనం పై బయలుదేరిన గంటకే మృత్యువాత పడ్డారు. మంగళవారం ఇంద్రవెల్లి నుండి ఉట్నూర్ వైపు వెళ్తున్న కారును పేందూరు లక్ష్మణ్ ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించిన క్రమంలో భార్యాభర్తలు ఇద్దరు రోడ్డుపై పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అదే సమయంలో ఉట్నూర్ నుండి ఇంద్రవెల్లి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డుపై పడిపోయిన వారిని పై నుండి వెళ్ళింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న పేందూర్ లక్ష్మణ్ (50) తలపై నుంచి బస్సు టైరు  వెళ్లడంతో తల పూర్తిగా నుజ్జు నుజ్జు కావడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందారు. కొన ఊపిరితో  కొట్టుమిట్టాడుతున్న పెందూర్  షేకు బాయి, (45) ను 108 అంబులెన్స్ లో ఉట్నూర్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

అన్న కొడుకు పెళ్లికి వెళ్తూ.. అనంతలోకాలకు..

కొమరం భీం జిల్లా జైనూరు మండలంలోని పట్నాపూర్‌లో గురువారం తన అన్న కొడుకు పెళ్లికి ముందు జరిగే పోచమ్మ పండుగకు దంపతులిద్దరూ సంతోషంగా ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఇంటి నుండి  బయలుదేరిన గంటలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గుడిహత్నూర్ మండలం తోయగూడాతో పాటు జైనూరు మండలం పట్నాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

రోడ్డు ప్రమాదంలో మరణించిన దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు పెళ్లి చేశారని, కొడుకు పెండ్లి వచ్చే ఏడాది చేసేందుకు దంపతులు ఇద్దరు నిర్ణయించినట్లు తోయగూడ గ్రామస్తులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో భార్యా భర్తలు మృతి చెందిన విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్ కుమార్ తెలిపారు.