జోడు పదవులపై కినుక!
కాంగ్రెస్‌లో ఎంపీ, ఎమ్మెల్యేలకే పార్టీ పదవులు
- కొందరు సీనియర్ల అసంతృప్తి
- అదనపు భారమేనన్న అభిప్రాయం
- అటు ప్రభుత్వం, ఇటు పార్టీ.. ఎలా సాధ్యమంటూ ప్రశ్నలు
- ఎన్నికల వేళ నియోజకవర్గం దాటడం కష్టమే
- కష్టపడే నేతలకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి) : పార్టీలో కష్టపడిన వారికి గుర్తిం పు ఎప్పుడు? పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశం ఎప్పుడు? అని చర్చ జరుగుతున్న వేళ.. అధికార కాంగ్రెస్ లో జోడు పదవుల వ్యవహారం కొత్త వివాదానికి దారితీస్తోంది. ప్రజాప్రతినిధులుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ పదవులు కట్టబెట్టడంపై కొందరు సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి అవకాశాలు కల్పించాల్సిన సమయంలో ఒకే వ్యక్తికి పలు బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభు త్వ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉంటున్నారని.. అలాంటి వారికి అదనంగా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే రెండు వైపులా పూర్తిస్థాయిలో న్యాయం చేయడం కష్టమ వు తుందని అభిప్రాయపడుతున్నారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం పని చేసే నాయకులను గుర్తించి పదవులు ఇవ్వడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందన్న వాదన విపిస్తోంది.
వీరికి పార్టీ పదవులు..
ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ లో కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ అనుబంధ సంఘాలకు చైర్మన్లుగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులుగా, పీసీ సీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా నియమించింది. ఇప్పటికే టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్‌గా నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ఉండగా, తాజాగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని టీపీసీసీ మీడియా కమిటీకి చైర్మన్‌గా అధిష్టానం నియమించింది.
ఎమ్మెల్యేలు వీర్ల పల్లి శంకర్‌కు టీపీసీసీ బీసీ సెల్ చైర్మన్, కవ్వంపల్లి సత్యనారాయణకు టీపీసీసీ ఎస్సీసెల్ చైర్మన్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌కు టీపీసీసీ ఎస్టీసెల్ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో పాటు ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, వంశీకృష్ణ, రాజ్‌ఠాకూర్, మేడిపల్లి సత్యం తదితరులకు జిల్లా కాంగ్రెస్ కమిటీ బాధ్యతలను కట్టబెట్టింది. వీరికి అదనంగా పార్టీ బాధ్యతలు కూడా అప్పగించడంతో పలువురు సీనియర్లతో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఎన్నికల వేళ ఇబ్బందులే..
ప్రజాప్రతినిధులకు జోడు పదవులు అదపు భారమే తప్పా.. పార్టీకి ఒరిగేదేమీ ఉండదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ప్రధానంగా ఎంపీలు అటు ఢిల్లీలో, ఇటు తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే కార్యకర్తలకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వారికి పార్టీ బాధ్యతలు కూడా అప్పగించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం కష్టమవుతుందన్న అభిప్రాయం క్యాడర్‌లో వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా ఎన్నికల సమయంలో సొంత నియోజకవర్గాలకే పరిమితం కావాల్సి వస్తుందని, పార్టీ శ్రేణులను అప్రమత్తం, సమన్వయం చేయడం కష్టంగా ఉంటుందని పలువురు నేతలు పేర్కొంటున్నారు. ఒక వేళ తప్పనిసరిగా సొంత నియోజకవర్గం దాటి వెళ్లాల్సి వస్తే స్థానికంగా రాజకీయ పరిణామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందన్నది వారి వాదన.
పార్టీ కోసం కష్టపడ్డ వారికిస్తేనే ప్రయోజనం..
ఒక్కరికే రెండుమూడు పదవులు అప్పగించడం కంటే.. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో ఇలాంటి సమయంలో ఒక్కో నాయకుడికి జోడు పదవులు ఇవ్వడం కంటే.. పార్టీ పరంగా కష్టపడి పనే చేసేవారిని గుర్తించి బాధ్యతలు అప్పగిస్తే సంస్థాగతంగా పార్టీకి మేలు జరుగుతుందని, క్యాడర్‌లో ఉత్సాహం పెరుగుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో పార్టీ పదవులు, లేదా ఇతర పదవుల భర్తీ సమయంలోనైనా ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కొందరు సీనియర్లు సూచిస్తున్నారు.






