అధైర్యపడకండి!
- పార్టీ అండగా ఉంటుంది
- పెద్ది కుటుంబానికి కేసీఆర్ పరామర్శ
- కన్నీళ్లు పెట్టుకున్న మాజీ సీఎం
- 2.25 కోట్ల చెక్కులు అందజేత
- నేడు నల్లబెల్లికి కేటీఆర్, హరీశ్‌రావు రాక
మహబూబాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ‘పెద్ది సుదర్శన్‌రెడ్డి మర ణంతో మీ కుటుంబానికే కాదు పార్టీకి తీరని లోటు.. పార్టీలో వరంగల్ జిల్లా కు పెద్ద దిక్కును కోల్పోయాం. అధైర్య పడకండి. అన్ని విధాలుగా మీ కుటుంబానికి అండగా ఉంటాం. పిల్లల భవి ష్యత్తు పూర్తిగా పార్టీ చూసుకుంటుంది. ఏ ఆపద రాకుండా అన్ని విధాలుగా అండగా నిలుస్తాం’ అంటూ దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభయమిచ్చా రు.
ఆదివారం ఎర్రవల్లి నుంచి రోడ్డు మార్గాన పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వగ్రామమైన వరంగల్ జిల్లా నల్లబెల్లికి కేసీఆర్ వచ్చారు. పెద్ది చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుమారు 40 నిమిషాల పాటు పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి స్వప్న, పిల్లలు, తల్లి అమృతమ్మ ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. పెద్ది కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ప్రకటించారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి కుమారుడు, కుమార్తెకు కోటి రూపాయల చొప్పున రెండు కోట్లు, తల్లి అమృతమ్మకు 25 లక్షల రూపాయల నగదు చెక్కులను అందజేశారు. అలాగే దశదినకర్మ అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి తన వద్దకు రావాలని ఆహ్వానించారు. కేసీఆర్ వెంట బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు ఉన్నారు.
నేడు నల్లబెల్లికి కేటీఆర్, హరీశ్‌రావు..
సోమవారం నల్లబెల్లిలో నిర్వహించే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ, సంస్మరణ సభలో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో సోమవారం నిర్వహించే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులంతా తరలివచ్చే అవకాశం ఉంది. సుమారు 50 వేల మందికి పైగా నాయకులు కార్యకర్తలు పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మకు హాజరవుతారని, ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.






