10 August, 2026 | 2:16 AM

జీవో 32 గండం!

10-08-2026 12:46 AM
  1. ఇరిగేషన్‌లో పదోన్నతులకు బ్రేక్
  2. నిబంధనలు, సర్వీస్ వ్యవహారాల్లో చిక్కులు 
  3. యూనియన్ల అభ్యంతరాలు 
  4. జీవో 32 రద్దు చేయాలని డిమాండ్
  5. ఏళ్ల నుంచి ఒకే  హోదా
  6. సీనియార్టీ ఉన్నా ఫలితం శూన్యం  
  7. జీతభత్యాలు, ఉన్నతావకాశాలపై ప్రభావం పడుతుందని ఆవేదన

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): నీటిపారుదల శాఖలో పదోన్నతుల ప్రక్రియ మరోసారి వివాదాస్పదంగా మారింది. ఏళ్లుగా ప్రమోషన్ల కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగులకు ‘జీవో 32’ అడ్డంకిగా మారింది. జీవోలోని నిబంధనలు, సీనియారిటీ అంశాలు, యూనియన్ల అభ్యంతరాల కారణంగా ప్రక్రియ ఆలస్యమవుతోందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరిగేషన్ శాఖలో వివిధ కేడర్లకు చెందిన ఉద్యోగులు పదోన్నతి కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.

ప్రమోషన్ల జాప్యంతో ఒకే హోదాలో ఎక్కువ కాలం కొనసాగాల్సి వస్తోంది. ఫలితంగా ఉద్యోగి హోదాతో పాటు జీతభత్యాలు, సర్వీస్ ప్రయోజనాలు, భవిష్యత్‌లో లభించే ఉన్నతావకాశాలపైనా ప్రభావం పడుతుంది. అర్హత, సీనియారిటీ ఉన్నప్పటికీ పదోన్నతులు దక్కడం లేదన్న అసంతృప్తి ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తమ తర్వాత సర్వీసులో చేరిన  ప్రమోషన్లు లభిస్తుండగా, తాము అదే హోదాలో కొనసాగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతుల జాప్యంతో వృత్తిపరంగానే కాకుండా మానసికంగానూ ఒత్తిడికి గురవుతున్నామని వారు వాపోతున్నారు.

సీఎం హామీ ఇచ్చినా నిరీక్షణే!

జీవో 32పై గతంలో ఉద్యోగ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన సందర్భంలో.. దాన్ని తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఇరిగేషన్ ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం మారి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ నిర్ణయం ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని కోరుతున్నారు.

సీనియారిటీ, అర్హత, ఖాళీలు, రోస్టర్ తదితర అంశాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయపరమైన లేదా పరిపాలనా సమస్య ఉంటే పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలే కానీ, ప్రక్రియనే నిలిపివేయడం వల్ల కెరీర్ నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్ల ప్రక్రియలో జాప్యం కారణంగా ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదని, క్షేత్ర సిబ్బందిపై పనిభారం పెరుగుతుందని పేర్కొంటున్నారు. ప్రాజెక్టులు, కాలువలు, రిజర్వాయర్లు, నీటి నిర్వహణకు సంబంధించిన అనేక పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అనుభవజ్ఞులైన సిబ్బందికి సకాలంలో పదోన్నతులు ఇవ్వడం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

ఇకనైనా నిర్ణయం తీసుకోవాలి

జీవో 32పై ఇకనైనా ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి, సెక్రెటరీ ప్రత్యేక దృష్టి సారించి ఉద్యోగ సంఘాలు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జీవో 32 వల్ల ఎదురవుతున్న సమస్యలు, కేడర్ల వారీగా ప్రమోషన్ల పెండింగ్, సీనియార్టీ వివాదాలు, అడ్డంకిగా మారిన న్యాయపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించి పరిష్కార మార్గం రూపొందించాలని ఉద్యోగులు కోరుతున్నారు. 

పదోన్నతి అనేది ఉద్యోగికి కేవలం హోదా పెరగడం మాత్రమే కాదు.. అతని సంవత్సరాల సేవకు లభించే గుర్తింపు. జీతభత్యాల్లో మెరుగుదల, భవిష్యత్ సర్వీస్ ప్రయోజనాలు,ఉన్నత స్థాయి బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ప్రమోషన్‌తోనే ముడిపడి ఉంటాయి.ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది.  ఉద్యోగుల సంక్షేమం, పరిపాలనా సంస్కరణలు, శాఖల సామర్థ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెడుతున్న సమయంలో.. ఇరిగేషన్ శాఖలో పదోన్నతుల సమస్యను కూడా పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అవసరమైతే జీవో 32ను తొలగించడమా?, ప్రమోషన్లకు ఇబ్బంది కలగకుండా మార్పులు చేయడమా? ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

చిక్కులు తెచ్చిపెడుతున్న జీవో 

పదోన్నతుల జాబితా సిద్ధం చేసే సమయంలో సీనియారిటీ, కేడర్ వారీగా ఖాళీ లు, అర్హతలు, నిబంధనల అమలు వంటి అంశాలపై స్పష్టత అవసరం. ఈ క్రమంలో జీవో 32కు సంబంధించి వివరణలు, అభ్యంతరాలు తెరపైకి వచ్చినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఒకసారి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత అభ్యంతరాలు రావడం, వాటిపై వివరణలు కోరడం, సంఘాలతో చర్చలు జరపడం వంటి పరిణామాలతో వ్యవహారం మళ్లీ మొదటి దశకు చేరుతోందని వారు అంటున్నారు. ఫలితంగా అర్హత ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లు కూడా పెండింగ్‌లో పడుతున్నాయనే వాదన వినిపిస్తోంది.

జీవో 32తో పాటు కొన్ని ఉద్యోగ సంఘాలు, యూనియన్ల నుంచి వస్తున్న అభ్యంతరాలు కూడా ప్రమోషన్ల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. సీనియారిటీ, కేడర్ కేటాయింపు, పోస్టుల భర్తీ వంటి అంశాలపై అభ్యంతరాలు ఉంటే వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించాల్సిందేనని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే కొంతమంది ఉద్యోగుల విషయంలో ఉన్న అభ్యంతరాల కారణంగా మొత్తం ప్రమోషన్ల ప్రక్రియను నిలిపివేయడం వల్ల ఎ లాంటి వివాదం లేని అర్హులైన ఉద్యోగు లు కూడా నష్టపోతున్నారు. సమస్య ఉన్న అంశాలను విడిగా పరిష్కరించి, మిగిలిన ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.