31 August, 2026 | 3:02 AM

జుక్కల్ సొసైటీ చైర్మన్ పీఠం దక్కేదెవరికో?

31-08-2026 02:00 AM

జుక్కల్, ఆగస్టు 30 (విజయక్రాంతి): జుక్కల్ మండల రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ పదవి కోసం ముగ్గురు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెరవెనుక మంతనాలు కూడా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. అసలు ఆ ముగ్గురు ఎవరు? ఎవరికి ఎమ్మెల్యే ఆశీస్సులు దక్కనున్నాయి? ఎవరికి చైర్మన్ పదవి దక్కితే సొసైటీకి న్యాయం జరుగుతుందనే చర్చ జరుగుతోంది? ఇదే ఇప్పుడు జుక్కల్ రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.

జుక్కల్ మండల యూత్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సతీష్ పటేల్ చైర్మన్ రేసులో ఉన్న ముఖ్యమైన ఆశావహుల్లో ఒకరిగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యూత్లో మంచి ఫాలోయింగ్తో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వివిధ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలను, నాయకులను కలుపుకొని ముందుకు వెళ్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

అంతేకాదు గతంలో ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం కూడా ఉండటంతో రైతులు, ప్రజలతో సమన్వయం చేసుకుని పనిచేసే అవకాశం సతీష్ పటేల్కు ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే చివరకు ఎమ్మెల్యే నిర్ణయం ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇక జుక్కల్ మాజీ సర్పంచ్ బొంపల్లి రాములు కూడా సొసైటీ చైర్మన్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

జుక్కల్ ప్రాంతంలో సీనియర్ నాయకుడిగా, రాజకీయంగా మంచి పరిచయాలు ఉన్న వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సర్పంచ్గా పనిచేసిన సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుని సహకార సంఘ చైర్మన్గా పనిచేయాలని ఆయన ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

దీంతో సతీష్ పటేల్తో పాటు బొంపల్లి రాములు పేరు కూడా చైర్మన్ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. రేసులో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేష్ దేశాయ్ ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ దేశాయ్ పేరు కూడా సొసైటీ చైర్మన్ రేసులో వినిపిస్తోంది. తన రాజకీయ అనుభవం పార్టీ పట్ల ఉన్న అనుబంధం పార్టీ కార్యక్రమాల్లో తన పాత్ర ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని తనకు అవకాశం కల్పించాలని ఆయన వర్గం కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇలా ఒకే పదవి కోసం ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది కూడా  ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ఈ ఎంపిక కొంత సవాల్గా మారినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే ఆశీస్సులు ఎవరికి? ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే.

ముగ్గురిలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆశీస్సులు ఎవరికి లభిస్తాయి? ఎవరిని చైర్మన్గా ఎంపిక చేస్తారు? ఇదే అంశంపై జుక్కల్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ముగ్గురు ఆశావహులు తమకు ఉన్న రాజకీయ బలాన్ని ఉపయోగించుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అదే సమయంలో పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన మరికొందరు నాయకులు కూడా తమకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

మిగతా ఆశావహులకు ఏం చేస్తారు?

ఒకరికి చైర్మన్ పదవి కట్టబెట్టిన తర్వాత మిగతా ఆశావహులను పార్టీ పరంగా ఏ విధంగా సర్దుబాటు చేస్తారు?వారికి ఏదైనా ఇతర పదవి లేదా బాధ్యత అప్పగిస్తారా? లేదా భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తారా? అనే చర్చ కూడా కొనసాగుతోంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ శ్రేణుల్లో నామినేటెడ్ పదవులపై ఆశలు పెరిగాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.

రైతులకు ఎవరు దగ్గర?

సహకార సంఘం అంటే ప్రధానంగా రైతులకు సంబంధించిన వ్యవస్థ. అందుకే కేవలం రాజకీయంగా ఎవరికి బలం ఉంది అనే అంశంతో పాటు రైతులతో ఎవరు బాగా పనిచేయగలరు? సొసైటీ సమస్యలను ఎవరు పరిష్కరించగలరు? రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఎవరు తీసుకెళ్లగలరు?

సొసైటీని పారదర్శకంగా ఎవరు నడిపించగలరు?

అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతాంగంతో మంచి సంబం ధాలు రాజకీయ అనుభవం అందరినీ కలుపుకొని వెళ్లే సామ ర్థ్యం, సహకార సంఘంపై అవగాహన ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చైర్మన్ ఎంపిక చేస్తే సొసైటీకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని పలువురు అంటున్నారు.

తెరవెనుక మంతనాలు జోరుగా?

ఇక సొసైటీ చైర్మన్ పదవిపై తెరవెనుక మంతనాలు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. ఎవరికి మద్దతు ఇవ్వాలి? ఎవరిని ముందుకు తీసుకెళ్లాలి? ఎవరికి అవకాశం ఇస్తే పార్టీకి రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది? అనే అంశాలపై నాయకులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాబట్టి ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలను రాజకీయ విశ్లేషణగానే చూడాల్సి ఉంటుంది.

చివరకు నిర్ణయం ఎవరిది? ముగ్గురు ఆశావహులు ఒకే చైర్మన్ పదవి ముగ్గురికీ రాజకీయ నేపథ్యం ముగ్గురికీ తమ తమ అనుచర వర్గం దీంతో జుక్కల్ సొసైటీ చైర్మన్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. చివరకు పార్టీ పెద్దల సూచనలు స్థానిక రాజకీయ సమీకరణాలు రైతుల ప్రయోజనాలు పార్టీ కోసం పనిచేసిన నాయకుల సేవలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

మరి జుక్కల్ సొసైటీ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుంది? సతీష్ పటేల్కా? బొంపల్లి రాములుకా? రమేష్ దేశాయ్కా? లేక రాజకీయ సమీకరణాల్లో అనూహ్యంగా మరో పేరు తెరపైకి వస్తుందా? ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచి చూడాల్సిందే. జుక్కల్ సొసైటీ చైర్మన్ ఎంపికపై అధికారిక నిర్ణయం వెలువడే వరరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.