3 August, 2026 | 2:18 AM

బీజాపూర్ హైవే పనులు కేంద్రం ఘనతే..

03-08-2026 01:12 AM

మీడియాతో -ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మొయినాబాద్ ఆగస్టు 2 (విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌బీజాపూర్ జాతీయ రహదారి అభివృద్ధి పనులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు.గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే బీజాపూర్ రహదారి విస్తరణ, భూసేకరణ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగిందని ఆయన విమర్శించారు.

నిజాం కాలం నాటి ఈ రహదారిపై ప్రస్తుతం పెరిగిన ట్రాఫిక్కు అనుగుణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆధునికీకరణ పనులు చేపడుతోందని చెప్పారు.రోడ్డు అభివృద్ధితో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల భద్రతా ప్రమాణాలతో పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. అలాగే, బీజాపూర్ హైవే ప్రాజెక్టును తామే తీసుకొచ్చామని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం వాస్తవాలకు విరుద్ధమని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు.