కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
తుక్కుగూడలో ఏఐటీయూసీ 4వ మహాసభలు
తుక్కుగూడ, ఆగస్టు 2 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురై ప్రభుత్వానికి పతనం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా 4వ మహాసభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల ద్వారా కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను పూర్తిగా కాలరాసిందని ఆయన విమర్శించారు. కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగానే గతంలో రైతులు ఢిల్లీలో చారిత్రాత్మక ఉద్యమం చేపట్టారని, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ పోరాటాలన్నీ కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ యూసఫ్, సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పానుగంటి పర్వతాలు, రామస్వామి, బి.దత్తు నాయక్, శేఖర్ రెడ్డి చందు యాదవ్, కొమ్మ గళ్ళ రాజు, పబ్బతి లక్ష్మణ్, నరసింహారెడ్డి, దేవేంద్ర గౌడ్, బ్రహ్మచారి, యాదగిరి, ఆర్టీసీ వెంకన్న, శివ చంద్రశేఖర్ అనిల్ రవి తదితరులు పాల్గొన్నారు.






