ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ప్రవాహాలు
- పెరుగుతున్న ఇన్‌ఫ్లో.. దిగువకు విడుదల
- భద్రాచలం శాంతించిన గోదావరి
- 43 అడుగులకు తగ్గిన వరద
- మూడు హెచ్చరికల ఉపసంహరణ
హైదరాబాద్/భద్రాచలం/వనపర్తి, ఆగస్టు 2 (విజయక్రాంతి): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో తెలంగాణలోని కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన జలాశయాలకు వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. పలు ప్రాజెక్టుల్లో ఇన్‌ఫ్లోలు పెరుగుతుండగా, అవసరానికి అనుగుణంగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్లలో ఇంకా గణనీయమైన నిల్వ సామర్థ్యం అందుబాటులో ఉండటం వరద నిర్వహణకు ఊరటనిస్తోంది.
ఇప్పటికే ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి వంటి కీలక ప్రాజెక్టులకు గణనీయమైన ఇన్‌ఫ్లోలు నమోదవుతుండగా.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నీటివనరుల శాఖ దిగువకు నియంత్రిత స్థాయిలో నీటిని విడుదల చేస్తోంది. అయితే వరద ప్రవాహాలు కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రిజర్వాయర్లలో ఇంకా సగానికిపైగా నిల్వ సామర్థ్యం ఖాళీగా ఉండటం గమనార్హం. భద్రాచలం వద్ద గత మూడు రోజులుగా గోదావరి పొంగి ప్రవహించింది.
శనివారం ఉదయానికి 56.10 అడుగులు చేరుకొన్నది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు రెండవ ప్రమాద హెచ్చరిక 48 అడుగులకు మూడవ ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు జారీ చేశారు. ఆదివారం సాయంత్రానికి 42 అడుగులకు చేరుకోవడంతో అధికారులు విడుదల చేసిన మూడు హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.







