22 April, 2026 | 3:26 AM

ప్రేక్షకులు తెరపై చరణ్‌ను గెలిపించాలి

22-04-2026 02:08 AM

చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సూర్య బి పాజిటివ్’. సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో రోహిత్ సత్యన్, సుజాత దీక్షిత్, చంద్ర గౌతమ్, సత్య, సురభి లలిత, గీతన్ సాయి తేజ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన ‘దండోరా’ చిత్ర దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ మాట్లాడుతూ.. “ఈ చిత్రబృందం చిన్న విషయాలు కూడా చాలా స్పష్టంగా గుర్తుండిపోయేలా చేశారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు.

మరో అతిథి ‘కిష్కింధపురి’ డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి మాట్లాడుతూ.. “హీరో అవ్వడం అంత సులువు కాదు, ప్రేక్షకులు వారిని హీరోలా చూసుకోవాలి. వారికి ఉన్న కష్టాలు మర్చిపోయి సినిమాలో హీరో గెలిచినప్పుడు తామే గెలిచినట్లు ఫీల్ అవ్వాలి. తెరపై చరణ్ గెలుపును చూసి ప్రేక్షకులు గెలిచినట్లు ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు. చిత్ర కథానాయకుడు చరణ్ మాట్లాడుతూ.. “నటుడిగా గుర్తింపు పొందాలంటే అర్హత ఉండాలని భావిస్తున్నా. గతంలో ఎంతో పెద్దవారికి అలాంటి అర్హతను ప్రేక్షకులు ఇచ్చారు.

నేను ఆ అర్హతను అడుగుతున్నా. అనివార్య కారణాల వల్ల నేను చేసిన మూడు సినిమాలు రిలీజ్‌కు రాలేదు. ఇది నాలుగో సినిమా. ఈ సినిమా ద్వారా నన్ను ప్రేక్షకులు అభినందిస్తారని కోరుకుంటున్నా. నేను ఎప్పటికీ ఆగిపోను, ముందుకు వెళ్లిపోతా. నన్ను అవమానించిన పర్లేదు, భవిష్యత్తులో సత్కారంగా మారుతుందని నమ్ముతున్నా” అన్నారు. నటి దివ్య విశ్వకర్మ మాట్లాడుతూ.. “నేను తెలుగు సినిమాలో నటించి ఈ స్టేజిపై నిలబడడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. నా భాష కానప్పటికీ నన్ను ఆదరించి, నాకు అవకాశం  ఇచ్చినందుకు ఆనందంతో పొంగిపోతున్నా” అని తెలిపారు. ‘ఇది నా తొలి సినిమా. అందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాన’ని మరో నటి యానీ డయానా అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు బలగం సత్య, రోహిత్ సత్యన్, సుజాత, లిరిసిస్ట్ రాంబాబు గోసాల కూడా మాట్లాడారు.