బీఆర్‌ఎస్ నాయకుల అరెస్టు దుర్మార్గపు చర్య
లాఠీలు, తూటాలు, అరెస్టులకు బీఆర్‌ఎస్ పార్టీ భయపడదు..
పార్టీ పట్టణ కన్వీనర్, కౌన్సిలర్ ఆంజనేయులు
మెదక్ జూన్ 18 (విజయక్రాంతి): మెదక్ పట్టణంలో బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు తెల్లవారుజామున 5 గంటల నుంచే ముందస్తుగా అరెస్టు చేయడం దు ర్మార్గమైన చర్య అని పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు విమర్శించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణ పోలీ స్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి కారణం చెప్పకుండా ఉదయం నుంచే పలువురు బీఆర్‌ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు.
అనంతరం సీఎం నివాసం ముట్టడి చేసే అవకాశముందని భావించి ముందస్తు అరెస్టులు చేసినట్లు పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి అరెస్టులు కొత్త కాదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో అరెస్టులు, లాఠీచార్జీలు, కేసులు, తూటాలను ఎదుర్కొంటూ ప్రజల కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్‌ఎస్ అని అన్నారు. లాఠీలు, తూటాలు, అరెస్టులకు తమ పార్టీ నాయకులు భయపడరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులపై దృష్టి సారించడం సరికాదని విమర్శించారు. అరెస్టులతో బీఆర్‌ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురి చేయలేరని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు ప్రజల పక్షాన పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కోకన్వీనర్ గడ్డమీద కృష్ణ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బట్టి ఉదయ్ కుమార్, దీపక్ కుమార్, జుబేర్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, నాయకులు ప్రభు రెడ్డి, ఇందాద్ సాయి తదితరులు ఉన్నారు.






