19 June, 2026 | 3:29 AM

డిజిటల్ క్యాబినెట్

19-06-2026 02:26 AM
  1. ఇక నుంచి పేపర్‌లెస్ విధానానికి ప్రభుత్వం శ్రీకారం 
  2. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు స్పెషల్ ట్యాబ్‌లు..
  3. అందజేసిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్‌లెస్‌గా నిర్వహించే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి మంత్రివర్గ సమావేశాలన్నింటినీ డిజిటల్ క్యాబినెట్‌గా నిర్వహిస్తారు. అందుకు ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను వినియోగిస్తోంది. గురువారం ఐటీ విభాగం తరఫున మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్‌లు అందజేశారు.

డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును కూడా అందరూ స్వ యం గా పరిశీలించారు. ఇకపై ఈ బుక్‌ద్వారానే క్యాబినెట్ సమావేశం ఎజెండా, నోట్స్ అన్ని మంత్రులకు అందుబాటులో ఉంచుతారు. పేపర్‌లెస్ గవర్నెన్స్‌లో భాగంగా తెలంగాణ డిజిట్ క్యాబినెట్ అమల్లోకి తీసుకురావడంతో.. ఇకపై కాగితాలతో పనిలే కుండా డిజిటల్ విధానంలో క్యాబినెట్ మీటింగ్‌లు జరుగుతాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రం ‘ఈ సొల్యూషన్స్’ సాప్ట్‌వేర్‌ను వినియోగిస్తోంది.

దీనికి పలు మార్పులు చేసి, తెలంగాణ మంత్రివర్గ సమావేశాలకు అనువుగా మార్చుకుని ఇక్కడ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ ఇన్‌కార్పొరేటెడ్ (ఎన్‌ఐసీఎస్‌ఐ)తో చర్చలు జరుపుతోంది. ఈ ప్రాజె క్టుకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్  (టీజీటీఎస్)ను నోడల్ ఎజెన్సీగా ప్రభుత్వం నియమించింది.

ఈ సాప్ట్‌వేర్ కోసం దాదాపు రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని రాష్ట్ర ఐటీశాఖ అంచనావేసింది. ఇందు లో భాగంగా ఎన్‌ఐసీకి మొదటి విడతగా రూ.20 లక్షలు చెల్లించేందుకు ప్రభు త్వం అనుమతిచ్చినట్లు తెలిపింది. ఈ క్యాబినెట్ విధానంతో మంత్రివర్గ ఎజెండాలు, నోట్‌లు, నిర్ణయాలు, ఫైళ్లు పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి. మంత్రివర్గ సభ్యులకు ప్రత్యేక పాస్‌వర్డ్, లాగిన్ ఐడీని అందిస్తారు. దీంతో పత్రాల భద్రత, గోప్యత మరింత పెరుగుతుంది.