టెలిగ్రామ్.. నేరగాళ్ల అడ్డా
- యాప్ కొత్త డార్క్ వెబ్‌తో చట్టవ్యతిరేక కార్యకలాపాలు
- యథేచ్ఛగా సైబర్ క్రిమినల్స్, డ్రగ్స్, దోపిడీ ముఠాలు దుర్వినియోగం
- డార్క్ వెబ్ లింక్‌ల వల్ల నేరగాళ్లనూ పట్టుకోవడం అసాధ్యం
- గ్రూపులు, చాన్నెళ్లతో హ్యాకింగ్, పైరసీ, డేటా చోరీ
- టెలిగ్రామ్‌పై ఎన్‌సీసీఆర్ పోర్టల్‌కు ఫిర్యాదల వెల్లువ
- ఢిల్లీ హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 18: సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల నుంచి ఉగ్రవాదం, లీకైన పరీక్ష పత్రా ల వ్యాప్తి వరకు పలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ కేంద్రబిం దువుగా ఉంటుందని కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఈ యాప్‌ను సైబర్ క్రిమిన ల్స్, డ్రగ్స్, దోపిడీ ముఠాలు, ఉగ్రవాదులు తమ సామ్రాజ్యానికి యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారని తెలిపింది.
హ్యాకింగ్.. పైరసీ.. డేటా చోరీకి కేరాఫ్ అడ్రస్‌గా టెలిగ్రామ్ గ్రూపులు, చాన్నెళ్లు నిలుస్తున్నాయని, పిల్లల లైంగిక ఫొటోలు, వీడియోలూ చక్కర్లు కొడుతున్నాయని పేర్కొంది. టెలిగ్రామ్‌పై ఎన్‌సీసీ ఆర్ పోర్టల్‌కు ఫిర్యాదలు వెల్లువెత్తుతున్నాయని చెప్పింది. ఈ మేరకు గురువారం ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
జూన్ 21న జరగనున్న నీట్-యూజీ పునఃపరీక్షకు ముందు యాప్‌ను తాత్కాలికంగా నిషే ధించాలన్నా కేంద్రం చర్యకు వ్యతిరేకంగా టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలని కోరుతూ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న శాస్త్రవేత్త మయాంక్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో విస్తుపోయే విషయాలు ఉన్నాయి. ఇండియన్ సైబ ర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) నివేదికను ఉటంకిస్తూ, సైబర్ నేరగాళ్లకు ఈ యాప్ ఒక ప్రాధాన్య వేదికగా మారిందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
వీరు నకిలీ ఖాతాలు, రహ స్య గుర్తింపులు, ఛానెళ్లు, గ్రూపులను ఉపయోగించి ఆర్థిక మోసాలు, మాల్వేర్ పంపిణీ, డేటా ఉల్లంఘనలు, లీకైన పత్రాల వ్యాప్తి వం టి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ అఫిడవిట్‌లో తెలిపారు. ప్రధానం గా టెలిగ్రామ్ గోప్యతా ఫీచర్ల కారణంగా, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరా లు, తీవ్రవాదం, ఉగ్రవాదం, బాలల లైంగిక దోపిడీ, సైబర్ స్కామ్‌లు, మోసాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు.
నీట్-యూజీ రీటెస్ట్‌కు ముందు టెలిగ్రామ్ యాక్సెస్‌ను పరిమితం చేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ యాప్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణ జరుపుతోం ది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో, వైద్య ప్రవేశాల కోసం మే 3న జరగాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ- కమ్ -ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్), లేదా నీట్-యూజీని మే 12న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసు ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో ఉంది. టెలిగ్రామ్ కొత్త డార్క్ వెబ్‌గా మారి, నేరగాళ్లకు వారధిగా మారుతోందని వెల్లడించింది. నేరగాళ్లు డీప్ వెబ్ లింకుల ద్వారా డార్క్ వెబ్ ఫోరమ్‌లకు అనుసంధానమయ్యే ఛానెళ్లలో లింకులను పోస్ట్ చేయడానికి టెలిగ్రామ్‌ను వేగంగా ఉపయోగించుకుంటున్నారు.
దీనివల్ల అధికారులకు నేరగాళ్లను గుర్తించడం, వారిని ట్రాక్ చేయ డం, వారి నేరాన్ని నిరూపించడం చాలా కష్టం గా మారిందని కేంద్రం తెలిపింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఈ యాప్‌నకు సంబంధించిన మోసాల ఫిర్యాదులు ఇటీవలి సంవత్సరాలలో భారీ సంఖ్యలో వచ్చాయని పేర్కొంది.
ఒకరికొకరికి తెలియకుండా..
ఒక్క 2025 సంవత్సరంలోనే రూ.3,086 కోట్ల మోసాలకు సంబంధించి 2.75 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. అపరిమిత సంఖ్యలో సబ్‌స్రైబర్లు ఉన్న టెలిగ్రామ్ ఛానె ళ్లు, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు సందేశాలను ప్రసారం చేసేందుకు రూపొందించబడ్డాయి. కానీ సబ్‌స్రైబర్ల గుర్తింపులు ఒకరికొకరికి తెలియకుండా ఉంటాయని, ఛానెల్ సృష్టికర్త లేదా ఎంపిక చేసిన అడ్మిన్లు మాత్రమే సందేశాలను పోస్ట్ చేయగలరని చెప్పింది.
సబ్ స్రైబర్లు కేవలం ఆ కంటెంట్‌ను మాత్రమే చూడగలరని కేంద్రం పేర్కొంది. స్థానిక చట్టాలను పాటించకపోవడం, కంటెంట్ మోడరేష న్‌లో వైఫల్యాలు, చట్ట అమలుకు సంబంధించిన ఆందోళనలు వంటి సమస్యలపై చైనా, ఇరాన్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, బ్రెజిల్ సహా పలు దేశాల్లో టెలిగ్రామ్‌పై తీసుకున్న నియంత్రణ, అమలు చర్యలను కూడా ప్రభుత్వం ప్రస్తావించింది.
సహ్యోగ్ పోర్టల్ ద్వారా జారీ చేసిన నోటీసులను టెలిగ్రామ్ పాటిస్తోందని, నీట్ పేపర్ లీక్‌లు, పరీక్షలకు సంబంధించిన మోసాలతో ముడిపడి ఉన్నాయని ఆరోపణలు ఉన్న ఛానెళ్లతో సహా అధికారులు ఫ్లాగ్ చేసిన అన్ని 404 యూఆర్‌ఎల్‌లకు యాక్సెస్‌ను తొలగించిందని లేదా నిలిపివేసిందని కేంద్రం కోర్టుకు తెలియజేసింది. వివాదాస్పదమైన నీట్ పరీక్షను సజావుగా నిర్వహించేం దుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది.
టెలిగ్రామ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా, కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాల వాదనలు విన్న అనంతరం, ఈ పిటిషన్‌పై హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. అప్పటి వరకు తమ లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఇరు పక్షాలను కోర్టు ఆదేశించింది.
నీట్ అభ్యర్థులకు ఉచిత బస్సు ప్రయాణం
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతిష్టాత్మక ‘నీట్’ పరీక్ష రాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 21వ తేదీన జరగబోయే నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించామని, టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డిని ఆదేశించానని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక ర్ వెల్లడించారు.
జూన్ 21న పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు బస్సు కండక్టర్‌కు తమ ‘నీట్ హాల్ టికెట్’ చూపిస్తే సరిపోతుందని తెలిపారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షా కేంద్రాలు ఉన్న రూట్లలో అదనపు బస్సు సర్వీసులను నడపాలని, స్టాప్‌ల వద్ద బస్సులు విధిగా ఆగేలా చూడాలని ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు.






