గుండె వ్యాధుల నిర్ధారణకు నిమ్స్ ఐఐఎస్సీ సంయుక్త ఏఐ పరిశోధన
పంజాగుట్ట, జూన్ 18 (విజయక్రాంతి): నగరంలోని నిమ్స్, బెంగళూరులోని ప్రతిష్టాత్మక భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్సీ) సంయుక్తంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వైద్య పరిశోధనలకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ఐఐఎస్సీ శాస్త్రవేత్తల బృందం గురువారం నిమ్స్ను సందర్శించింది. రెండు సంస్థల అధ్యాపకులు, వైద్య నిపుణులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది.
నిమ్స్ డీన్ డాక్టర్ పి. చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బులు, ఊబకాయం వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే ఖచ్చితత్వంతో గుర్తించేందుకు అవసరమైన ఏఐ నమూనాల రూపకల్పనపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా నిమ్స్ డీన్ మాట్లాడుతూ భయంకరమైన వ్యాధులను ముందే గుర్తించడంలో, రోగులకు వేగవంతమైన, అత్యంత ఖచ్చితమైన సమాచారంతో సమర్థవంతమైన చికిత్స అందించడంలో ఏఐ సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ సంయుక్త పరిశోధన ద్వారా అభివృద్ధి చేసే అత్యాధునిక ఏఐ మోడళ్లు వైద్యులకు క్లినికల్ నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడతాయన్నారు.
సాధారణ ప్రజలకు తక్కువ వ్యయంతో మెరుగైన, అందుబాటు వైద్య సేవలు అందించడంలో ఉపయోగపడతాయన్నారు. భారతీయ రోగుల శారీరక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ఈ వినూత్న ఏఐ సాంకేతికతను ఇరు సంస్థలు కలిసి తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిమ్స్ తరఫున వైద్యులు లిజా, భూషణ్ రాజు, అనూ కపూర్, సుబ్బలక్ష్మి, సుజాత పట్నాయక్, రామకృష్ణ, ఆన్నీ, రవితేజ, పాయల్, ఐఐఎస్సీ బెంగళూరు తరపున వైద్యులు శ్రీరామ్, హేమ, అనఘ పాల్గొన్నారు.






