ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు.
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఈఓ రమేష్ కుమార్.
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో(Nagarkurnool District) పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే ఎనిమిది గంటల నుండి ఆయా పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోలాహలం మొదలైంది. ఆయా పరీక్ష సెంటర్ల వద్దకు తమ పిల్లలను చేర్చి ఆల్ ద బెస్ట్ చెబుతూ ధైర్యాన్ని ఇచ్చారు. ఈ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సిఎన్ఆర్ పాఠశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. జిల్లాలో మొత్తం 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా పరీక్షల నిర్వహణ కోసం 4 మంది రూట్ ఆఫీసర్లు, 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 60 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 20 మంది కస్టోడియన్స్, 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 120 సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు, 519 మంది ఇన్విజిలేటర్లు నియమించినట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాల వివరాలు తెలుసుకోవడానికి హాల్ టికెట్‌పై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చని తెలిపారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలోని 265 పాఠశాలలకు చెందిన మొత్తం 10,658 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 5,294 మంది బాలురు, 5,364 మంది బాలికలు ఉన్నారు. అన్ని విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని డీఈఓ రమేష్ కుమార్ ఆకాంక్షించారు.




