సీజేపీ మళ్లీ పోరుబాట
- హామీల అమలులో కేంద్రం జాప్యం
- నిరసనగా ఇండియా గేట్ నుంచి భారీ ర్యాలీ
- డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం
- సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్
న్యూఢిల్లీ, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థులను మోసం చేసిందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మండిపడ్డారు. కేంద్ర వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 5న ఢిల్లీలో మరో భారీ ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ నిర్వహించనునట్టు సోమవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో మానసిక వేదనకు గురై బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని కేంద్రం ఇచ్చిన హామీని విస్మరించిందని సౌరవ్ దాస్ ఆరోపించారు. జెన్ జీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. సెప్టెంబర్ 5న జరిగే ర్యాలీలో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలతో పాటు పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన బాధితులు ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తారని తెలిపారు.
విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సీజేపీ ప్రతినిధులు వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌ల రద్దు ప్రక్రియను కేంద్రం అడ్డుకుంటోందని ఈనెల 18న అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులపై కేసులు ఎత్తివేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోమని రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది.






