8 July, 2026 | 6:50 PM

కాంగ్రెస్‌ లో రగిలిన వర్గ.. విభేదాలు

08-07-2026 05:31 PM

రాళ్లు, కర్రలతో దాడులు – పోలీసుల లాఠీచార్జ్

ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గం – అసమ్మతి వర్గం మధ్య తీవ్ర ఘర్షణ

గాంధీభవన్‌కు బయలుదేరిన నాయకుల వాహనాన్ని అడ్డుకున్న ప్రత్యర్థి వర్గం

రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు.. నాయకులు, పోలీసులకు గాయాలు

అర్వపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి.. భారీగా మోహరించిన పోలీసులు

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య బుధవారం తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గం, అసమ్మతి వర్గం నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు బుధవారం ఒక్కసారిగా హింసాత్మకంగా మారడంతో అర్వపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుల నియామకంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్‌పై ఫిర్యాదు చేసేందుకు గాంధీభవన్‌కు బయలుదేరిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులను అర్వపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోగా ఒక్కసారిగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, అనంతరం రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు.

ఈ ఘర్షణలో పలువురు కాంగ్రెస్ నాయకులు గాయపడగా, పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నంలో కొందరు పోలీసు సిబ్బందికి సైతం స్వల్ప గాయాలయ్యాయి.పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘటన అనంతరం అర్వపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. దేనితో సామాన్య ప్రజలు భయభ్రాంతుకు లోనయ్యారు.

అధికార పార్టీ నాయకుల మధ్యన ఈ విధంగా గొడవ జరుగుతుంటే రావణ రోజుల్లో ఏ విధంగా ఉంటుందో, పార్టీ ఉంటుందా, పోతుందా అనే సందేహాలు ప్రజల్లో కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటే తప్ప ఈ ఈ సంఘటనలు మళ్లీ పునరావృతం అవుతానని నాయకులు బిక్కుబిక్కుమంటున్నారు. జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ప్రజల హక్కులకు భంగం కలిగించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, సామాన్య ప్రజలు కోరుతున్నారు.