గోదాములను వెంటనే తరలించాలి
- డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
- గోదాముల పరిసరాల పరిశీలన
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడి
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని గొదాంగడ్డ ప్రాంతంలో గల గిడ్డంగుల (వేర్ హౌజ్) కేంద్రాన్ని బుధవారం రోజున బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సందర్శించారు. వేర్ హౌజ్ అధికారులు సిబ్బందితో కలిసి గోదాముల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గోదాములలో ఉన్న ప్యాడీ (ధాన్యం) నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిడ్డంగుల కార్యాలయంలో వేర్ హౌజ్ మేనేజర్ విజయతో గోదాం లను తరలించడంతో పాటు, చుట్టు ప్రక్కల డివిజన్ల ప్రజల ఇబ్బందులు, భారీ వాహనాల రాక పోకల వల్ల జరుగుతున్న ప్రమాదాలు, కాలుష్యం తదితర విషయాలను సుదీర్ఘంగా చర్చించి గోదాంల తరలింపు విషయాన్ని పై అధికారులతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెల్లాలని వేర్ హౌజ్ మేనేజర్ విజయ కు సూచించారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ 1966 లో ఈ గోదాములను ఏర్పాటు చేసినప్పుడు ఇది పట్టణ శివారు ప్రాంతంగా ఉండేదని అయితే, కాలక్రమేణా నగర విస్తరణతో ప్రస్తుతం ఈ గోదాముల చుట్టూ నివాస ప్రాంతాలు, కాలనీలు ఏర్పడ్డాయని,గోదాములకు వచ్చే భారీ వాహనాల వల్ల స్థానికంగా తరచూ ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతున్నారు. అందుకే ఈ గోదాములను ఇక్కడి నుంచి తరలించాలన్నారు. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టి లో పెట్టుకొని గతంలోనే డిల్లీలో సీడబ్లుసి చైర్మన్ కు గోదాంలను తరలించాలని వినతి పత్రాలు కూడ సమర్పించామని తెలిపారు.
గతంలో నగరానికి రైల్వే స్టేషన్ లేకపోవడంతో గోదాములను ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం రైల్వే స్టేషను అందుబాటులో ఉన్నందున సంబంధిత గోదాములను రైల్వే స్టేషన్ సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గోదాముల తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెల్తామని కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా గోదాములను వేరే చోటుకు మార్చేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతామని స్పష్టం చేశారు.






