29 July, 2026 | 2:12 AM

కామన్‌వెల్త్ వేదికపై తెలుగోడి తడాఖా

29-07-2026 12:48 AM

గ్లాస్గో, జూలై 28 : కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వల్లూరి అజయ్ బాబు అదరగొట్టాడు. పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.ఉత్కంఠ పోరులో 330 కేజీల బరువురు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 149 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కేజీలు లిఫ్ట్ చేశాడు. ప్రస్తుత గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌కు సంబంధించి భారత్‌కు ఇది ఆరో మెడల్.

కాగా  విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల అజయ్‌బాబు తండ్రి శ్రీనివాసరావు కూడా వెయిట్‌లిఫ్టరే. 2010 ఢిల్లీ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆయన 56 కేజీల విభాగంలో కాంస్యం సాధించాడు. తండ్రి ఇచ్చిన శిక్షణతో ఇప్పుడు అజయ్‌బాబు అంతకంటే ఎక్కువ ప్రదర్శనతో రజతం సాధించి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచాడు. అజయ్‌బాబుకు ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.