12 July, 2026 | 2:37 AM

గద్వాల్‌లో మహిళ దారుణ హత్య

12-07-2026 01:22 AM

గద్వాల టౌన్, జూలై 11(విజయక్రాంతి): జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ఓ మహిళను ఆమె సమీప బంధువే కత్తితో దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హత్య అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు గద్వాల్ పట్టణంలోని బీసీ కాలనీ, బీసీ హాస్టల్ సమీపంలో నివాసం ఉంటున్న శంకరమ్మ (59)పై ఆమె సమీప బంధువైన మేకల రామంజి శనివారం ఇంట్లోనే కత్తితో దాడి చేశాడు. దీంతో శంకరమ్మ తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం.

హత్య అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది.బంధువుల మధ్య జరిగిన స్వల్ప వాగ్వాదమే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.