ఎలక్ట్రానిక్స్ తయారీలో గ్లోబల్ హబ్‌గా తెలంగాణ
- ఆ దిశగా రాష్ట్రంలో ‘ఎకో సిస్టం’ అభివృద్ధి
- కోటి టీవీలను ఉత్పత్తి చేసిన హైదరాబాద్ కంపెనీ ‘రేడియంట్’
- ప్రత్యేకంగా అభినందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి) : ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రపంచస్థాయి కేంద్రం(గ్లోబల్ హబ్)గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. కేవలం ఉత్పత్తుల అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా, విడిభాగాల తయారీనుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంవరకు అవసరమైన పూర్తిస్థాయి ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామన్నారు.
శనివారం సచివాలయంలో.. కోటి టెలివిజన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకు న్న హైదరాబాద్‌కు చెందిన ‘రేడియంట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రేడియంట్ సంస్థ సాధించిన ఈ ఘనత తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు.
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమాన్నరు. కార్యక్రమంలో రెజల్యూట్ గ్రూప్ ఛైర్మన్ రమీందర్ సింగ్ సోయిన్, డైరెక్టర్ మణికందన్, లీగల్ అండ్ ఐపీఆర్ హెడ్ శుభజిత్ సాహా, అడ్మినిస్ట్రేషన్ హెడ్‌నోయెల్ రాబిన్‌సన్ పాల్గొన్నారు.




