11 July, 2026 | 4:53 AM

పోలంపల్లి సర్పంచ్ రాజ్యలక్ష్మి సస్పెన్షన్

11-07-2026 02:15 AM

- మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్/చేగుంట, జులై 10 (విజయక్రాంతి): అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు పడింది. మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లి గ్రామపంచాయతి సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉత్తర్వులు జారీచేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డివిజనల్ పంచాయతీ అధికారి తూప్రాన్ సమర్పించిన నివేదిక ప్రకారం గ్రామ పంచాయితీ పరిధిలో హరితహరంలో నాటిన మొక్కలను సర్పంచ్ భర్త కొండి స్వామి నరికినారని, గ్రామ పంచాయితీ ఫర్నిచర్ ద్వంసం చేశారని, ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామపంచాయితీ టాయిలెట్స్ కూల్చివేసినారని, గ్రామ పంచాయతీకి తాళంవేసినట్లు తెలిపారు. అలాగే పాలక వర్గం సమావేశాలలో పాల్గొంటున్నారని స్పష్టముగా నివేదిక ఆధారంగా నిర్ధారణ అయినట్లు తెలిపారు.

సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి పేరుతో తన భర్త కొండి స్వామి సర్పంచుగా వ్యవహరిస్తున్నారని స్పష్టంగా తేటతెల్లమైనట్లు పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం 37(1) (ii) (iii) (iv) సర్పంచ్ తనలో విహితమై ఉన్న తన అధికారములను, తన స్థితిని దుర్వినియోగం చేసినారని, తన విధులను నిర్వహించుటలో చెడు నడవడికతో ఉన్నారని నిర్ధారణ అయినందున తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టము 2018 లోని సెక్షన్ 37(5) ప్రకారము కొండి రాజ్యలక్ష్మి ఆరు మాసములకు  తాత్కాలికముగా తొలగించినట్లు పేర్కొన్నారు.