26 February, 2026 | 3:48 AM

సైబర్ నేరాలపై సర్జికల్ స్ట్రుక్!

26-02-2026 01:58 AM
  1. రంగంలోకి 137 రాష్ట్ర పోలీసు బృందాలు, 512 మంది సిబ్బంది

మ్యూల్ అద్దె అకౌంట్లపై 16 జిల్లాల్లో 137 బ్యాంక్ బ్రాంచీలపై ఏకకాలంలో దాడులు

దేశవ్యాప్తంగా 9,431 సైబర్ నేరాలతో లింకులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): సైబర్ నేరాల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకిలించేందుకు తెలంగాణ పోలీసులు భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టా రు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వ్యూహరచనతో మంగళవారం నుంచి ఆపరేషన్ క్రాక్‌డౌన్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. మ్యూల్ అకౌంట్ల అద్దె ఖాతాలపై పోలీసులు పంజా విసిరారు.

రాష్ర్టంలోని 16 జిల్లాల పరిధిలో ఉన్న 137 బ్యాంక్ బ్రాంచీలలో ఏకకాలంలో దాడులు నిర్వహించి కేవైసీ వివరాలు సేకరించారు. బ్యాంకు సిబ్బంది, ఏజెంట్ల కుమ్మక్కు తోనే వందలాది నకిలీ ఖాతాలు ఆపరేట్ అవుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగుచూడటం సర్వత్రా విస్మయానికి గురిచే స్తోంది. టీజీసీఎస్‌బీ డేటా విశ్లేషణ ప్రకారం ఒక్క 2025 సంవత్సరంలోనే తెలంగాణలో 4,775 మ్యూల్ అకౌంట్లు ఆపరేట్ అయినట్లు అధికారులు గుర్తించారు.

ఇందులో భాగంగా ఆపరేషన్ క్రాక్‌డౌన్ తొలి రోజు 16 జిల్లాల కమిషనరేట్ల పరిధిలోని 137 బ్యాంకు శాఖల్లో ఉన్న 1,888 అనుమానిత ఖాతాలపై పోలీసులు సోదాలు చేపట్టారు. మొత్తం 512 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కూడిన 137 బందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ప్రస్తుతం తనిఖీ చేయబడుతున్న ఈ 1,888 అకౌంట్లకు.. దేశవ్యాప్తంగా నమోదైన 9,431 సైబర్ నేరాలతో తెలంగాణలోని 782 కేసులతో సహా ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఒకే ఖాతా.. వందల కొద్దీ నేరాలు

పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. కొన్ని బ్యాంకు శాఖల్లో వందల కొద్దీ మ్యూల్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ బ్రాంచ్‌లో నిర్వహిస్తున్న ఒకే ఒక బ్యాంకు ఖాతాకు.. వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఏకంగా 496 సైబర్ క్రైమ్ ఫిర్యాదు లతో సంబంధం ఉన్నట్లు తేలింది.

సూర్యాపేట జిల్లాలోని కేవలం నాలుగు బ్యాంక్ బ్రాంచీల్లో ఏకంగా 298 మ్యూల్ అకౌంట్లు ఉన్నట్లు, వీటికి ఎన్నో కేసులతో లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకే బ్రాంచ్‌లో ఇన్ని ఫేక్ అకౌంట్లు ఓపెన్ అవుతుండటంతో.. ఇందులో బ్యాంక్ సిబ్బంది, అకౌంట్లు తెరిపించే ఏజెంట్ల హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

చిన్న బ్యాంకుల లొసుగులతో దందా

ఆర్టీజీఎస్ సాంకేతిక సామర్థ్యం లేని కొన్ని చిన్న బ్యాంకులు.. నిధుల బదిలీ కోసం జాతీయ బ్యాంకుల ఆర్టీజీఎస్ సర్వర్లను వాడుకుంటున్నాయి. అయితే, ఈ చిన్న బ్యాంకుల్లో ఖాతాలు తెరిచే వ్యక్తుల వివరాలను సరైన పద్ధతిలో కేవైసీ ధ్రువీకరణ చేయడం లేదు. సైబర్ నేరగాళ్లు కచ్చితంగా ఈ సాంకేతిక, నిర్వహణ లోపాన్నే ఆసరాగా చేసుకుని దేశవ్యాప్తంగా సైబర్ ఫ్రాడ్స్‌కు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఆపరేషన్ క్రాక్ డౌన్ ఇక్కడితో ఆగిపోదని, రాబోయే కొద్ది నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతుందని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. ఈ సాహసోపేతమైన ఆపరేషన్ క్రాక్‌డౌన్ కార్యక్రమాన్ని రూపొం దించిన టీజీసీఎస్‌బీ, ఆ విభాగం డైరెక్టర్ శిఖా గోయెల్‌ను తెలంగాణ డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు.