13 June, 2026 | 2:59 AM

మీనాక్షికి సుప్రీం కోర్టు షాక్

13-06-2026 12:53 AM
  1. నామినేషన్ పిటిషన్ కొట్టివేత
  2. ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాలన్న ధర్మాసనం
  3. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది: మీనాక్షినటరాజన్
  4. ఇదంతా ప్రధాని మోదీ ఆదేశాలతోనే..: మల్లికార్జున ఖర్గే
  5. రాష్ట్రపతి భవన్‌కు కాంగ్రెస్ నేతల యత్నం.. అరెస్ట్

న్యూఢిల్లీ, జూన్ 12 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించారని ఆమె వేసుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అయితే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించడమే సరైన మార్గమని ధర్మాసనం సూచించింది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ఇక ప్రజాకోర్టులోనే తేల్చుకుంటానని మీనాక్షినటరాజన్ అన్నారు.

ఇదంతా ప్రధాని మోదీ ఆదేశాలతోనే.. జరిగిందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మినాక్షి పిటిషన్ తిరస్కరణతో రాష్ట్రపతి భవన్‌కు  కాంగ్రెస్ నేతలు వెళ్లేందుకు యత్నించగా, వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీనాక్షినటరాజన్ పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం న్యాయ మూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్లు విచారించారు. నటరాజన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు.

కేవలం సమన్లు మాత్రమే జారీ అయ్యాయని, క్రిమినల్ కేసులు కూడా ఆమెపై లేవన్నారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 329 ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యాన్ని పరిమితం చేస్తుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అందువల్ల, ఈ విషయంలో సుప్రీంకోర్టు రిట్ పిటిషన్‌ను స్వీకరించలేదన్నారు. ఈ నిర్ణయాన్ని ఆమె వ్యతిరేకిస్తే, ఎన్నికల పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. నామినేషన్ రద్దు చేయాలన్న నిర్ణయం సరైనదా? కాదా? అనే దానిపై కోర్టు వ్యాఖ్యానించలేదని స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరిస్తే దానిపై ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిం చడమే సరైన మార్గమని తెలిపింది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని కొట్టివేసింది.

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. తనకు ఒకే లీగల్ నోటీసు వచ్చిందన్నారు. అందుకు సంబంధించిన వివరాలను ఈసీఐ మెమోరాండంలో అందించానని చెప్పారు. కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారం 26లో ప్రైవేట్ ఫిర్యాదుల గురించిన సమాచారం కోసం కాలమ్ లేదని ఉంటే సమాచారాన్ని అందించి ఉండేవాళ్లమని మీనాక్షి పేర్కొన్నారు.

ప్రజాకోర్టులో ఈ అంశాన్ని తేల్చుకుంటానన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం చట్టానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అన్నారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే ఇలా జరిగిందన్నారు. మోదీ ప్రజాస్వా మ్యాన్ని, కాంగ్రెస్‌ను మట్టుబెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారిని అత్యున్నత పదవుల్లో నియమించుకొని మోదీ కాంగ్రెస్‌పార్టీని భూస్థాపితం చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాజ్యసభ అభ్యర్థి పరిమిల్ నాథ్వానీకి మాత్రం పూర్తి సమయం కేటాయించి,

ఫారమ్‌లో తప్పొప్పులను సరిదిద్దారని, కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి విషయంలో అలా జరగలేదని నేరుగా నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ కుట్రే అని మల్లిఖార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా ఈ చర్యను వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్రగా వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకోగా, పోలీసులు స్వల్ప బలప్రయోగం చేశారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షు డు జితు పట్వారీ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సొంతపూచీకత్తుపై వారిని విడుదల చేశారు.