8 June, 2026 | 1:47 PM

ముగిసిన వేసవి హాకీ శిక్షణా శిబిరం

08-06-2026 12:05 AM

చిట్యాల, జూన్ 7: మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వేసవి హాకీ శిక్షణా శిబిరం ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శిబిరంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు ఉచితంగా స్పోరట్స్ యూనిఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జాతీయ క్రీడ అయిన హాకీకి గ్రామీణ ప్రాంతాల్లో ప్రోత్సాహం లభించడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పోటీతత్వం, శారీరక మరియు మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేయగా, గ్రామ సర్పంచ్ భానుశ్రీ, తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షుడు పల్లపు బుధుడు, మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగొని స్వామి, కాంగ్రెస్ జిల్లా నాయకులు పొలగోని నరసింహ హాకీ స్టిక్స్ను అందజేశారు.

మద్ది ప్రవీణ్ కుమార్ రెడ్డి క్రీడాకారులకు సాక్స్లను స్పాన్సర్ చేయగా, ఎస్‌ఎంఎస్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, అగ్రికల్చర్ ఏఈఓ మందుగుల శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు గంగాపురం రాము, మర్రి కల్పన, మర్రి సంధ్య, సీనియర్ క్రీడాకారులు జనగాం స్వామి, గంగాపురం వెంకన్న, జలపాల రాము, వార్డు సభ్యులు, విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.