26 April, 2026 | 2:49 PM

దొంగతనం చేసి దొరికిపోతాననే, ఆత్మహత్య డ్రామా

26-04-2026 12:48 PM

హైదరాబాద్: పోలీసులు వేధిస్తున్నారంటూ మానవ హక్కుల కమిషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ కేసులో ట్విస్ట్. దొంగతనం చేసి దొరికిపోతాననే, ఆత్మహత్య డ్రామా ఆడినట్లు పోలీసులు  గుర్తించారు. వివరాల్లోకి వెళితే... శ్రీవాణి, చంద్రకాంత్ అనే ఇద్దరు దంపతులు కవాడిగూడలో నివాసముంటున్నారు. గత ఐదేళ్లుగా సత్వ మాల్ సమీపంలోని నెక్లెస్ ప్రైడ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే అరోరా అనే మహిళ ఇంట్లో సదరు మహిళ పని చేస్తుంది. శ్రీవాణి ఇళ్లల్లో పని చేస్తుండగా, భర్త చంద్రకాంత్ ఓ కంపెనీలో టెక్నీషియన్ ఉద్యోగం చేస్తున్నాడు.

ఇటీవల మహిళ ఇంట్లో ఏడు తులాల బంగారం పోయిందని, పని మనిషి శ్రీవాణిపై అనుమానం ఉందని గాంధీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శ్రీవాణి, ఆమె భర్తను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, విచక్షణారహితంగా కొట్టారని, దొంగతనం చేసిందని అపార్ట్మెంట్ అంతా తన ఫోటోలను పోస్టర్లుగా అంటించారని, మనస్థాపంతో ఈనెల 8వ తేదీన నాంపల్లి వద్ద ఉన్న మానవ హక్కుల కమిషన్ ఎదుట ఆమె, భర్త, పిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడారు.

ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఇద్దరిపై నిఘా పెట్టారు.  దొంగిలించిన బంగారాన్ని భార్యాభర్తలు దశల వారీగా దోమలగూడలోని ఓ బంగారు దుకాణంలో విక్రయిస్తున్నట్లు పోలీసుల నిర్ధారించారు. దంపతులిద్దరిని అదుపులోకి తీసుకుని, ఏడు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీంతో శ్రీవాణి, ఆమె భర్తను విచారించడంతో, దొంగతనం బయటపడుతుందని ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.