జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన
- డిప్లొమా విద్య ప్రాధాన్యతను కాపాడాలి
- విద్యార్థి సంఘాలు
నస్పూర్,(విజయక్రాంతి): యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలిపారు. విద్యార్థుల నిరసనకు మద్దతుగా AISB, PDSU, SFI విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీం, జీవో నెంబర్ 97 కారణంగా తమ విద్యా భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు, తాజా నిర్ణయాల వల్ల మళ్లీ ఇంటర్మీడియట్ చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. దీనివల్ల తమ విలువైన మూడు సంవత్సరాల విద్యా కాలం వృథా అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో డిప్లొమా కోర్సులను ఐటీఐలు, ఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల డిప్లొమా విద్య ప్రాధాన్యత, ప్రత్యేకత దెబ్బతింటుందన్నారు.
సాంకేతిక విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, డిప్లొమా విద్యను సాధారణ శ్రామిక శిక్షణ స్థాయికి తీసుకెళ్లే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) స్వతంత్రతను దెబ్బతీసే విధంగా జీవో నెంబర్ 97 ఉందని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యకు ప్రత్యేక గుర్తింపు, సాంకేతిక విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ఉన్నత విద్య అవకాశాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
వెంటనే జీవో నెం. 97ను వెంటనే రద్దు చేయాలని, పాలిటెక్నిక్ డిప్లొమా విద్య ప్రాధాన్యత, ప్రత్యేకతను కాపాడాలని, డిప్లొమా విద్యను ఐటీఐలు, ఏటీసీలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, SBTET స్వతంత్రతను కాపాడాలన్నారు. అలాగే డిప్లొమా విద్యార్థులకు ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని, విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలపై విద్యార్థి సంఘాలతో, సాంకేతిక విద్యా నిపుణులతో ప్రభుత్వం చర్చించాలి.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడొద్దని, తక్షణమే జీవో నెం.97ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులను ఐక్యం చేసి మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AISB జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఢీకొండ జతిన్ గౌడ్, కనుకుంట్ల సన్నీ గౌడ్, PDSU జిల్లా ఉపాధ్యక్షులు సికిందర్, కే. కార్తీక్, ADI జిల్లా కో కన్వీనర్ విష్ణు ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.






