విద్యతోనే జీవితాల్లో మార్పు
- మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్ణంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.1.45 కోట్ల వ్యయంతో చేపట్టిన రెనోవేషన్ పనులు పూర్తికావడంతో నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తును రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... తన నియోజకవర్గంలో విద్యకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
విద్యా రంగం అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలన్నదే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యతోనే జీవితాల్లో మార్పు : ఎంపీ వంశీకృష్ణ
కాకా వెంకటస్వామి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. విద్యతోనే మన జీవితాలను మెరుగుపరుచుకోవచ్చని, విద్యార్థులకు నాణ్యమైన విద్యా వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.






