26 August, 2026 | 4:04 AM

ముందుకు సాగని ‘తరగతి’ గది

26-08-2026 12:26 AM

అసౌకర్యాల నడుమ విద్యార్థుల విద్యాభ్యాసం

కేసముద్రం, ఆగస్టు 25 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పన కోసం కొన్నేళ్ల క్రితం చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. దీనితో తమ పిల్లలకు పాఠశాలల్లో సరైన తరగతి గదులు లేక విద్యాభ్యాసానికి ఇబ్బందులు కలుగుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేసముద్రం మండలంలోని ఇంటికన్నె, ఇనుగుర్తి మండలంలోని ఇనుగుర్తి జిల్లా పరిషత్ పాఠశాలల్లో చాలా ఏళ్ల క్రితం ప్రారంభించిన అదనపు గదుల నిర్మాణం స్లాబులకే పరిమితం చేసి గోడలు నిర్మించకుండా వదిలేసారనే విమర్శలు వస్తున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలను అసంపూర్తిగా వదిలేయడంతో ఎందుకు పనికి రాకుండా మళ్ళీ శిథిలం గా మారే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

ఇనుగుర్తి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చేపట్టిన రెండంతస్తుల భవన నిర్మాణం దాదాపు దశాబ్ద కాలంగా పూర్తి చేయడం లేదని ఆరోపిస్తున్నారు. దీనితో ఈ భవనం పరిస్థితి ప్రస్తుతం అధ్వానంగా మారిందని చెబుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి రెండు అంతస్తుల భవనం నిర్మిస్తే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా విద్యాబోధనకు అవకాశం ఉంటుందని భావిస్తే, అసంపూర్తిగా నిర్మాణాన్ని వదిలేయడంతో ఇప్పటివరకు వెచ్చించిన నిధులు నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదే విధంగా ఇంటికన్నె జిల్లా పరిషత్ పాఠశాలలో కూడా అదనపు తరగతి గది నిర్మాణం స్లాబ్ లెవల్ లో వదిలేశారు. గోడలు నిర్మించి కిటికీ డోర్లు ఏర్పాటు చేసి, ఫ్లోరింగ్ చేస్తే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.