జలపాతంలో పడి విద్యార్థి దుర్మరణం
ములుగు జిల్లాలో ఘటన
ములుగు (మహబూబాబాద్), జూలై 8 (విజయక్రాంతి): తోటి మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన బీటెక్ విద్యార్థి ప్రమాదవశాత్తు ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని దూలాపురం మాసలొద్ది జలపాతంలో జారిపడి దుర్మరణం పాలయ్యాడు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన వైభవ్ కుమార్ (18) స్నేహితులతో కలిసి వరంగల్ జిల్లాకు విహారయాత్రకు వెళ్లాడు. హనుమకొండ వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి, రామప్ప గుడి సందర్శించుకుని, ములుగు జిల్లాలోని బోగత జలపాతాన్ని సందర్శించారు.
అక్కడ నుంచి మాసాలొద్ది జలపాతం వద్దకు చేరుకున్న క్రమంలో కాలుజారి జలపాతం లోయలోకి వైభవ్ జారి పడిపోయాడు. మిత్రులు గాలించగా అతని ఆచూకీ లభ్యం కావడంతో ప్రభుత్వ వైద్యశాలకు బైక్‌పై తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటాపురం సీ ఐ ముత్యం రమేష్, జక్కుల సతీష్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రధమ చికిత్స నిర్వహించి సిపిఆర్ చేసి మెరుగైన వైద్యం కోసం ఎటునాగారం ప్రభుత్వ వైద్యశాలకు 108లో తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎంతో సంతోషంగా విహారయాత్రకు వచ్చిన మిత్రులు తమలో ఒకరు ప్రమాదంలో మరణించడంతో విషాదంగా మారింది.






