3 March, 2026 | 3:38 AM

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క

03-03-2026 12:09 AM

ఇళ్ల నిర్మాణాలకు డబ్బులు అడగొద్దు.. దరఖాస్తుదారులను ఇబ్బంది పెట్టొద్దు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, మార్చి 2 (విజయక్రాంతి): ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. ఇళ్ల నిర్మాణాలకు అనుమతుల కోసం డబ్బులు అడగొద్దు... బాధితులను ఇబ్బంది పెట్టొద్దు.. అవినీతికి తావు లేకుండా ఇంటి అనుమతుల కోసం వచ్చే ప్రజలకు సులువుగా అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ విభాగం డీసీపీ, ఎసీపీలు బ్రోకర్ల ద్వారా ఏజెన్సీలను పెట్టుకుని ప్రజలను వేధిస్తూ లంచాలు తీసుకుని అనుమతి ఇవ్వాలనుకుంటే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే వెంటనే బదిలీపై వెళ్లవచ్చన్నారు. నిజాయితీగా రూల్స్ ప్రకారం పనిచేసే వాళ్లపై మా రాజకీయ ఒత్తిళ్లు ఉండవని, వాళ్లపై ఈగ కూడా వాలనివ్వను కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే సులువుగా అనుమతి ఇవ్వాలే తప్ప రూల్స్ పేరుతో రకరకాల కొర్రీలు పెట్టి ప్రజలను ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిప్పించుకోవద్దన్నారు. బ్రోకర్లతో, ఏజెన్సీలతో పని లేకుండా వాళ్లకు పైసలిచ్చుకునే పని లేకుండా ఈజీగా ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఇవ్వాలన్నారు. అందుకోసం మున్సిపల్ ఆఫీసుకు వచ్చే ప్రజల కోసం “హెల్ప్ డెస్క్‌” తరహా టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రత్యేక పేరుతో డెస్క్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.

కొత్త పాలకవర్గం మార్క్ చూపాల్సిందేనని తెలిపారు. ఎవరైనా ఇంకా అవినీతిని కొనసాగిస్తామనుకుంటే మాత్రం కరీంనగర్ లో ఉండటానికి వీల్లేదని, బదిలీపై వెళ్లొచ్చన్నారు. గతంలో మీరు ఏం చేశారో నాకు అనవసరం, ఇకపై మాత్రం అవినీతికి దూరంగా ఉండాలన్నారు. పనుల కోసం వచ్చే సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా అనుమతి ఇవ్వాలి, సహకరించాలన్నారు. అనుమతి లేకుండా అనధికారికంగా ఇండ్లు, కమర్షియల్ భవనాలు నిర్మిస్తుంటే... ఆరంభంలోనే వాటిని ఆపాలన్నారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ఎన్ని నిర్మాణాలు అక్రమంగా, అనధికారికంగా కొనసాగుతున్నాయో గుర్తించి వాటన్నింటినీ వారం రోజుల్లోపు నోటీసులివ్వాలని, నోటీసులకు సమాధానం ఇవ్వకపో యినా, అక్రమ నిర్మాణాలను కొనసాగించినా కొరడా ఝుళిపించాలని తెలిపారు. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సహాయం వాటిని కూ ల్చివేయాలని, ప్రభుత్వ స్థలాలను పూర్తిగా కాపాడాలన్నారు.

కరీంనగర్ కు ఐకానిక్ గా ఉండే ప్రాజెక్టులు ఏమైనా ఉంటే చెప్పాలని, వాటి అమలు కోసం, నిధుల కోసం నేను ప్రయత్నిస్తానాని, పెద్ద ఎత్తున సీఎస్సార్ ఫండ్స్ తీసుకోస్తానన్నారు. అతి త్వరలోనే “అటల్ క్యాంటీన్‌” లను ఏర్పాటు చేసి ఆసుపత్రులు, మార్కెట్ కూడళ్లలో పేదలకు పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని కడుపు నిండా పెట్టేలా చర్యలు తీసుకుంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.