ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం
కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేష్ హెచ్చరిక
జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించే కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేష్ స్పష్టం చేశారు. కీసర సర్కిల్ , జవహర్ నగర్ పరిధిలోని పలు సర్వే నంబర్లలో వెలిసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు. జవహర్ నగర్ పరిధిలోని సర్వే నంబర్లు 207, 240, మరియు 384 లలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా బేస్మెంట్లు, ఇళ్లను నిర్మిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రెవెన్యూ బృందం:వివిధ ప్రాంతాల్లో వెలిసిన అక్రమ కట్టడాలను జేసీబీలతో నేలమట్టం చేశారు. నిర్మాణ దశలో ఉన్న బేస్మెంట్లను పూర్తిగా తొలగించారు.
చట్టపరమైన చర్యలు తప్పవు
ఈ సందర్భంగా తహసీల్దార్ రాజేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. అక్రమ వెంచర్లు, అనధికారిక కట్టడాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కూల్చివేత కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సత్యనారాయణ, పాల్గొన్నారు.






