17 June, 2026 | 5:07 AM

వ్యసనాలకు బానిసగా మారి ద్విచక్రవాహనాల దొంగతనాలు

17-06-2026 01:34 AM

వివరాలు వెల్లడించిన సీఐ సోమ నరసయ్య 

మిర్యాలగూడ, జూన్ 16 : చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన ఇద్దరు సులభంగా డబ్బు సంపాదన కోసం బైక్ దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మంగళవారం మిర్యాలగూడ టూ టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ సోమనర్సయ్య దొంగల వివరాలు వెల్లడించారు.

నల్గొండ పట్టణంలోని ఆర్జల బాయికి చెందిన కొంగరి నవీన్ కుమార్, సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్ల పాలెం గ్రామానికి చెందిన సోమిరెడ్డి సైదిరెడ్డిలు సెంట్రింగ్ పని చేస్తూ మద్యం, గుట్కా, పేకాటలకు బానిసలుగా మారారు. కూలీ పనులతో వచ్చే డబ్బులు చాలక బైక్ దొంగతనాలకు తెర లేపారు.

ఇద్దరు కలిసి మిర్యాలగూడ పట్టణ పరిధిలో పార్క్ చేసి ఉన్న 9 బైక్ లు దొంగిలించారు. ఇలా దొంగిలించిన బైక్ లను దామరచర్ల మండలం వాడపల్లి కి చెందిన పాత ఇనుము వ్యాపారి కంచరకుంట్ల సుమలతకు తక్కువ ధరకు అమ్మేవారు. ఆమె వాటి స్పేర్స్ ని విడి విడిగా చేసి రూ. 3 వేలకు అమ్ముకునేది. కాగా మంగళవారం హనుమాన్ పేట ప్లై ఓవర్ వద్ద వాహన తనిఖీ చేస్తున్న టూ టౌన్ పోలీసులు నవీన్ బైక్ ని ఆపి రిజిస్ట్రేషన్ పత్రాలు అడిగారు.

తడబడిన అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా బైక్ దొంగతనాల విషయం వెలుగులోకి వచ్చింది. నవీన్, సైది రెడ్డి లతో పాటు పాత ఇనుప కొట్టు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 2 బైక్ లు, రూ.1,38,000ల నగదు రికవరీ చేసినట్లు సీఐ పేర్కొన్నారు. కేసును ఛేదించిన సీఐ సోమనర్సయ్య, ఏఎస్‌ఐ షేక్ గఫార్, హెచ్సీ ఆర్. స్వర్ణ నాయక్, పి.సీలు పి. బాలకృష్ణ, కే. కళ్యాణ్, ఎల్, సూర, మణిదీప్, సమద్, అక్బర్ పాషా, రామకృష్ణ, రాజశేఖర్, లక్ష్మయ్యలను ఉన్నతాధికారులు అభినందించారు.