15 June, 2026 | 8:56 PM

Breaking News

ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •  

హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!

15-06-2026 07:35 PM

స్థానిక విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ పిలుపు

అత్యాధునిక ల్యాబ్‌లు ప్రారంభం

త్వరలో రూ.42 కోట్ల అభివృద్ధి పనులు

హుస్నాబాద్: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో హుస్నాబాద్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల వేగంగా అభివృద్ధి చెందుతోందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ అన్నారు. సోమవారం కళాశాలను సందర్శించిన ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ ప్రయోగశాలలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి టీజీ ఈసెట్, 19వ తేదీ నుంచి టీజీ ఈఏపీసెట్ సర్టిఫికెట్ ధృవీకరణ కేంద్రాలను కళాశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కృత్రిమ మేధస్సు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో మొత్తం 240 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి అధిక ఖర్చులు భరించాల్సిన అవసరం లేకుండా, స్థానిక విద్యార్థులు హుస్నాబాద్ కళాశాలలో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలని ఆయన సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గేట్ పరీక్షకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ, ప్లేస్‌మెంట్ మార్గదర్శకత్వం, డిజిటల్ తరగతులు, ఆధునిక వసతులతో కూడిన తరగతి గదులు, శీతలీకరణ సౌకర్యాలను అందిస్తున్నట్లు తెలిపారు.

కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, ఉమ్మాపూర్‌లో రూ.27 కోట్ల వ్యయంతో నూతన కళాశాల భవనం, రూ.15 కోట్లతో బాలుర, బాలికల హాస్టళ్ల నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, ఆధునిక సదుపాయాలు కల్పిస్తూ ప్రాంతీయ విద్యా కేంద్రంగా హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాల రూపుదిద్దుకుంటోందని ఆయన పేర్కొన్నారు.