రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి
డిహెచ్‌పిఎస్ జిల్లా కార్యదర్శి యంగల ఆనందరావు
సత్తుపల్లి,(విజయక్రాంతి): దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్‌పిఎస్) సత్తుపల్లి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని డిహెచ్‌పిఎస్ జిల్లా కార్యదర్శి యంగల ఆనందరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నెల 15, 16, 17 తేదీల్లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాగోల్ బండ్లగూడలోని నవచేతన విజ్ఞాన సమితి ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి పది మంది ప్రతినిధులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.
ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ దళిత, బడుగు బలహీన వర్గాలను విద్యకు, నాణ్యమైన వైద్య సేవలకు దూరం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. సామాజిక, రాజకీయ చైతన్యం పెంపొందించుకోవడానికి ఇలాంటి రాజకీయ శిక్షణ తరగతులు ఎంతో అవసరమని, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డి హెచ్ పి ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి తడికమల్ల యోబు, జిల్లా కమిటీ సభ్యులు చిల్లిముంత మధు, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల నాయకులు చిల్లిముంత రవి, కోలేటి వెంకటేశ్వరరావు, వెంకటరమణ, తడికమల్ల యశోద, కిన్నెర లక్ష్మి, ఆళ్లగట్ల జిగిరి తదితరులు పాల్గొన్నారు.






