13 July, 2026 | 9:11 PM

భూముల రీ సర్వేతో భవిష్యత్తులో వివాదాలు ఉండవు

13-07-2026 08:14 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియతో భవిష్యత్తులో భూ వివాదాలు ఉండవని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదరపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ రాజస్వ మండల అధికారులు లోకేశ్వర్ రావు, చెన్నూరి కిష్టయ్య, సర్వే ల్యాండ్ రికార్డ్ ఎ.డి. వినయ్ లతో కలిసి భూముల రీ సర్వే మండలాల తహసిల్దార్లు, మండల సర్వేయర్లు, గిర్ధవార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో రీ సర్వే కొరకు ఎంపిక చేసిన గ్రామాలలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సర్వే నిర్వహించాలని తెలిపారు. భూముల రీ సర్వే ప్రక్రియ ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలకు ఎలాంటి అవకాశం ఉండదని తెలిపారు. మొదటి విడతలో జిల్లాలో గ్రామ నక్షాలు లేని 37 గ్రామాలు ఉన్నాయని, రెండవ విడతలో 70 గ్రామాలు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. మొదటి విడతలో ఎంపిక చేసిన గ్రామాలలో సర్వే నిర్వహించడంతో గ్రామ నక్షా రూపొందించడం జరుగుతుందని, 2వ విడతలో ఎంపికైన గ్రామాలలో రీ సర్వేలో భాగంగా ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

సర్వే ప్రక్రియలో డి జి పి ఎస్, రోవర్స ను ఉపయోగించడం జరుగుతుందని, సర్వే పూర్తి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రీ సర్వేతో భవిష్యత్తులో రైతుల మధ్య పొలాల గెట్ల గొడవలు ఉండవని, రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదాలు గల భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. సర్వే ఉద్దేశం ప్రజలకు వివరించి ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జిల్లా మంచి స్థానంలో ఉందని, ప్రస్తుతం 67 శాతం ఫారాల డిజిటలైజేషన్ జరిగిందని, వారంలోగా ఎన్యువరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తిచేయాలని తెలిపారు. సాదా బైనమా, భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కుల, ఆదాయ, నివాస, ఇతర ధ్రువీకరణ పత్రాల కొరకు వచ్చిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.