బాచుపల్లిలోని భారీ అక్రమ షెడ్లు
పార్టీ నాయకుడి పేరు చెప్పుకుంటూ చెలరేగిపోతున్న నిర్మాణదారులు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న వైనం
అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ షెడ్లు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి కొడుతున్నారు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బాచుపల్లి చౌరస్తా నుండి మియాపూర్ వెళ్లే రహదారిలో బాచుపల్లి ఫ్లై ఓవర్ పక్కన అక్రమ నిర్మాణదారులు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ షెడ్లు నిర్మిస్తున్నారు.
అధికార పార్టీ ముఖ్య నాయకుడి పేరు చెప్పుకుంటూ అక్రమంగా షెడ్లు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అక్రమ నిర్మాణదారులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ నిర్మాణాలే తమ ధ్వేయంగా పార్టీ పరువు తీస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
అధికార పార్టీ ముఖ్య నాయకుడి పేరు వాడుతూ అక్రమ నిర్మాణాలు
సదరు అక్రమ నిర్మాణదారులు పార్టీ ముఖ్య నాయకుడి చెప్పుకుంటూ షెడ్లు నిర్మిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమాల పట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ అనుమతులు లేకుండా రోడ్ల పై నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయాలని సీఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తునప్పటికీ...కొందరు అక్రమ నిర్మాణదారులు మాత్రం అవేమి పట్టకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టారాజ్యంగా అక్రమ షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు.
అనుమతులు లేకుండా, కనీసం సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న అక్రమ షెడ్ల పట్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందేమోనని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.అక్రమ షెడ్ల పై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలగ్గొడమే కాకుండా, అమ్యామ్యాలకు అలవాటు పడి లక్షల్లో దండుకుంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ షెడ్లకు అడ్డుకట్ట వేసి,ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






