ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు
అసిఫాబాద్,(విజయక్రాంతి): రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలోని 33వ పోలింగ్ స్టేషన్‌లో అంగన్‌వాడీ కేంద్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని వార్డు సభ్యుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గులాం జావిద్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమం సక్రమంగా జరుగుతున్న తీరును సమీక్షించి, అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు నమోదు, వివరాల సవరణ, కొత్త దరఖాస్తులు, మార్పులు, తొలగింపుల ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తి కావాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలో ఒక్క అర్హ ఓటు కూడా జాబితాలో చేరకుండా మిగిలిపోకూడదనే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న బీఎల్‌వోలకు అవసరమైన సహకారం అందిస్తూ, ఇంటింటికీ వెళ్లి అర్హులైన ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హ పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకుని తన ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. రాజంపేట పరిధిలో ఓటరు జాబితా సంపూర్ణంగా ఉండేలా అధికారులు, బీఎల్‌వోలతో సమన్వయం చేస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.






