17 June, 2026 | 3:25 AM

రాజకీయ, విద్యా, ఉద్యోగ హక్కులు కల్పించాలి

17-06-2026 12:39 AM

బీసీ ముస్లింలు అన్యాయానికి గురవుతున్నారు 

వారి జనాభాకు తగిన రాజకీయ ప్రాతినిథ్యం లేదు

ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు 

మాజీ డీజీపీ డాక్టర్ జే పూర్ణచంద్రరావు 

హైదరాబాద్, జూన్ 16(విజయక్రాంతి): తెలంగాణలో బీసీ ముస్లింలు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా అధికారికంగా గుర్తింపుపొందినా రాజకీయ ప్రాతినిధ్యం, అధికార భాగస్వా మ్యంలో ఇంకా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అఖిల భారత బహుజన సమాజ్ (ఏఐబీఎస్‌పీ) జాతీయ సమన్వయకర్త డాక్టర్ జే పూర్ణచంద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బీసీ ముస్లిం సభ సందర్భంగా ఆయన మాట్లాడారు.

బహుజన మహా నాయకుడు కాన్షీరాం  ‘మేమెంతో మాకంత’ సిద్ధాంతమే సామాజిక న్యాయానికి నిజమైన కొలమానం అని అన్నారు. తెలంగాణలో అబ్బాని, అట్టార్, ఫకీర్, గోసాంగి ముస్లిం, గారడి ముస్లిం, హజ్జాం, లబ్బాయి, పింజారి (దూదేకుల), ఖురేషీ, షేక్, సయ్యద్ ఫకీర్ తదితర బీసీ-ఈ ముస్లిం వర్గాలు, బీసీ-బీలోని దూదేకుల, లద్దాఫ్, పింజారి వర్గాలు సామాజికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తింపుపొందినా, వారి జనాభాకు తగిన రాజకీయ ప్రాతినిథ్యం లభించడం లేదన్నారు.

తెలంగాణ అసెంబ్లీలో ఓసీ ముస్లిం వర్గాలు 2 శాతం, బీసీ ముస్లింల జనాభా దాదాపు 10 శాతం ఉన్నప్పటికీ, బీసీ ముస్లింల నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న అసమానతలకు నిదర్శనమని అన్నారు. అదే సమయంలో కొన్ని కమ్మ, రెడ్డి వెలమ కేవలం ఐదు శాతం జనాభా ఉన్నప్పటికీ అసెంబ్లీ నుంచి సగం ఆ కులాల ఎమ్మెల్యేలు ఉన్నారని రాజకీయ అధికారాన్ని అనుభవిస్తున్నాయన్నారు.

బహు జన సమాజంలోని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కలిపి రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ, అధికార నిర్మాణాల్లో వారి వాటా చాలా తక్కువగా ఉందని తెలిపారు. అందువల్ల రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో, శాసనసభ, శాసన మండలి, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల్లో జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ ముస్లింలకు జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం, బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా బలోపేతం చేయడం, విద్య, ఉపాధి రంగాల్లో ప్రత్యేక అవకాశాలు, స్థానిక సంస్థలు, శాసనసభల్లో తగిన వాటా, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సముచిత ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

150 మంది బీసీ ముస్లిం సర్పంచులను సన్మానించడం , గ్రామీణ స్థాయిలో నాయకత్వాన్ని పెం పొందించడం ద్వారా బహుజన రాజకీయ సాధికారత మరింత బలపడుతుందని అన్నారు. బహుజన సమాజం రాజకీయంగా సంఘటితమై, కాన్షీరాం ఓటు మనది.. సీటు మనది.. రాజ్యం మనది అనే లక్ష్యంతో ముందుకు సాగితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఎఫ్ ఎస్‌ఎం అ వహీద్, మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర, జస్టిస్ చంద్ర కుమార్, డ్రామా డైరెక్టర్ విజయభాస్కర్, యూట్యూబర్ బీసీ నాయకులు బాలరాజు, మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బాషా, వివిధ బీసీ ముస్లిం బహుజన నాయకులు పాల్గొన్నారు. తొలివెలుగు రఘు కార్యక్రమానికి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.