మీసేవ వాట్సాప్‌తో ఎస్‌ఎస్‌సీ హాల్ టికెట్లు
మొదటి రోజే డౌన్‌లోడ్ చేసుకున్న 30 వేల మంది విద్యార్థులు
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ నంబర్ 8096 95 8096 ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని మీ సేవ కల్పించింది. ఈ సర్వీసు గురువారం నాడు అందుబాటులోకి రాగా రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ముందుగా 8096 95 8096 నంబరును తమ ఫోన్‌లో మీసేవా తెలంగాణ పేరుతో సేవ్ చేసుకోవాలి.
తర్వాత వాట్సాప్‌లో ఆ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపితే చాట్‌బాట్ ప్రారంభమవుతుంది. అనంతరం ఎస్‌ఎస్‌సీ హాల్ టికెట్ అని టైప్ చేసి మెను నుంచి ఓపెన్ సర్వీస్ ఎంపిక ఎంచుకోవాలి. ఆ తర్వాత జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లాంటి వివరాలను నమోదు చేస్తే హాల్ టికెట్ వెంటనే వాట్సాప్‌లో ప్రత్యక్షమవుతుంది. విద్యార్థులు ఫోన్‌లో సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
మీ సేవ వాట్సాప్ సేవలకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 8 లక్షల ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి. ఎక్కువగా వినియోగిస్తున్న సేవల్లో. బర్త్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, పోలీస్ చలాన్, విద్యుత్ బిల్లు చెల్లింపులతో పాటు తాజాగా ప్రారంభమైన ఎస్‌ఎస్సీ హాల్ టికెట్ సేవ ఉన్నాయి. మీ సేవ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, సులభంగా చేరవేయాలన్న ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు స్మార్ట్ ఫోన్ ద్వారా పలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్టు మీసేవ కమిషనర్ టీ.రవికిరణ్ వెల్లడించారు.




