‘నీట్’పై దద్దరిలిన పార్లమెంట్
- కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్
- నినాదాలు, ఆందోళనలతో గందరగోళం
- వరుసగా ఐదో రోజూ స్తంభించిన పార్లమెంట్
- ఉభయ సభలు సోమవారం వరకు వాయిదా
న్యూఢిల్లీ, జూలై 24 (విజయక్రాంతి): నీట్- ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు తమ ఆందోళనలను మరింత ఉధ తం చేశాయి. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభల్లో సభ్యులు నినాదాలు చేశారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు మరోసారి స్తంభించాయి.
శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరపాలని, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభ్యుల ఆందోళనలు, నినాదాల మధ్య సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం మధ్యాహ్నం సభ తిరిగి సమావేశమై నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో, సభాపతిగా వ్యవహరించిన బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ లోక్‌సభను సోమవారం వరకు వాయిదా వేశారు.
రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో అక్కడి కార్యకలాపాలు సజావుగా సాగలేదు. ఈ నెల 20న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రతిపక్షాల నిరసనల కారణంగా వరుసగా ఐదు రోజులుగా అంతరాయానికి గురవుతున్నాయి. ఇప్పటివరకు ఒక్కరోజు కూడా ప్రశ్నోత్తరాల సమ యం పూర్తిగా నిర్వహించలేకపోయారు.
కీలక బిల్లులు, ఇతర శాసన కార్యక్రమాలు కూడా ముందుకు సాగడం లేదు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేశాయి.
వీడియోలు కాదు.. సభలో సమాధానం చెప్పండి : ఖర్గే డిమాండ్
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయకుండా సోషల్ మీడియా వీడి యోల ద్వారా స్పందించడం సరికాదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శిం చారు. వీడియోల ద్వారా వన్‌సైడ్ మన్‌కీ బాత్ వినిపించాల్సిన అవసరం లేదన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై గురువారం అర్ధరాత్రి ప్రధాని మోదీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశారు.
నీట్ లీకేజీలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నామని, దీనిపై కేబినేట్‌లో చర్చిస్తామని మోదీ తన వీడియోలో తెలిపారు. గురువారం అర్ధరాత్రి విడుదల చేసిన వీడియోలో ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకొస్తామని, దీనికి సంబంధించిన బిల్లును వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని తన తన వీడియోలో తెలిపారు. ఈ అంశంపై కేంద్ర కేబినెట్‌లోనూ చర్చించినట్లు చెప్పారు.
పేపర్ లీక్‌లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన ఖర్గే.. పార్లమెంట్‌కు వచ్చే ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలతో లక్షలాది మం ది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని, వారికి ప్రధాని క్షమాపణ చెప్పాలని కోరారు.
అలాగే నీట్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఈ చర్యల అనంతరమే పార్లమెంట్‌లో విద్యా వ్యవస్థ, నీట్ వివాదంపై సమగ్ర చర్చకు ప్రతిపక్షం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.






