25 July, 2026 | 12:58 AM

కూసు‘మంచి’ స్కూల్ @ 800

25-07-2026 12:00 AM
  1. ఈ ఏడాది కొత్తగా 300 అడ్మిషన్లు 
  2. మొత్తం 800కు చేరిన విద్యార్థుల సంఖ్య 
  3. కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్న ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు 
  4. సమిష్టి కృషి.. మెరుగైన సౌకర్యాలు.. ఉత్తమ బోధనతో పెరిగిన అడ్మిషన్లు
  5. సత్ఫలితాలిచ్చిన బడిబాట 

 కూసుమంచి, జులై 24(విజయక్రాం తి): పచ్చని చెట్ల మధ్య విశాలమైన ప్రాంగ ణం.  డిజిటల్ స్క్రీన్లు, సౌకర్యవంతమైన తరగతి గదులు. వీటితోపాటు విశాలమైన ఆటస్థలం, నోరూరించే మధ్యాహ్న భోజనం, మినరల్ వాటర్ సౌకర్యం. అన్నింటికీ మించి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం. వారి సమిష్టి కృషి.. కార్పోరేట్ స్కూళ్ళను తలదన్నే విధంగా అహ్లాదకరమైన వాతావరణం.. ఇవ్వన్ని కూసుమంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సౌకర్యాలే.

వీటికి ఆకర్షితులై విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారు బడివైపు అడుగులు వేశారు.  అందుకు నిదర్శనమే 800 మంది విద్యార్థులు.. ఇది సామాన్య సంఖ్య కాదు.. రోజురోజుకు ఇక్కడ చదివే విద్యార్థుల సంఖ్య   క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది కొత్తగా గురువారం నాటికి 300 అడ్మిషన్లు అయ్యాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. 

ఉన్నత విలువలు.. ఉత్తమ బోధన..

కూసుమంచి హైస్కూల్ లో ఉన్నతమైన చదువులు.. ఉపాధ్యాయుల ఉత్తమ బోధన తో పాటు విద్యార్థులకు ఉన్నత విలువలను అక్కడ ఉపాధ్యాలు నేర్పిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో క్రమశిక్షణ నేర్పించడం, వారు క్రమశిక్షణ లో నడవడం ఆ స్కూల్ మంచి వాతావరణం లో నడుస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. 

ఇంగ్లీష్ మీడియం బోధన.. మంచి ఫలితాలు..

కూసుమంచి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల క్రమ సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఇంగ్లీషు మీడియంలో అధ్యాపకులు బోధన.. విద్యార్థులందరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుండటం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనం. అలాగే ప్రతి ఏడాది  అద్భుతమైన పదో తరగతి ఫలితాలు రావడం కూడా ఆ స్కూల్ అధ్యాపకుల గొప్పతనం. అందుకే విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. 

మండల వ్యాప్తంగా విద్యార్థులు హాజరు..

కూసుమంచి మండలంలో మొత్తం 8 ఉన్నత పాఠశాలలు, మూడు ప్రైవేట్ పాఠశాలలు, ఒక కస్తూరిబా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలలో రోజురోజుకు స్టెంత్ పడిపోతుండగా,  కూసుమంచి హైస్కూల్ కు మాత్రం అమాంతంగా సంఖ్య పెరుగుతూ వస్తోంది. మండల వ్యాప్తంగా విద్యార్థులు కూసుమంచి ఉన్నత పాఠశాలలో జాయిన్ అవుతున్నారు. 

పాఠశాలలో కేక్ కటింగ్, సంబరాలు..

పాఠశాలలో 300 మంది విద్యార్థులు ఈ సంవత్సరం జాయిన్ కావడం. 800 మంది సంఖ్య పెరగడంతో పాఠశాలలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణి చేసుకున్నారు. విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఎంఈవో ,పాఠశాల ప్రధానోపాధ్యాయలు రాయల వీరస్వామి మాట్లాడుతూ.. 

ఆధునిక సదుపాయాలు, మెరుగైన మౌలిక వసతులు, సాంకేతికత ఆధారిత బోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అందుతున్న మెరుగైన వసతులు, ఇంగ్లీష్ మీడియం బోధన, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాల కారణంగా   ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల జోరు కొనసాగుతోందన్నారు.

ప్రైవేట్ బడుల నుంచి టీసీలు తీసుకుని మరీ విద్యార్థులు సర్కారు బడుల బాట పడుతున్నారన్నారు. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి 120 మంది వచ్చారన్నారు. పిల్లలకు కేవలం పాఠ్యాంశాలే కాదు ఆలోచనా శక్తి, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం పెంచే విధంగా బోధన కొనసాగుతుండటం తల్లిదండ్రులను ఆకర్షిస్తోందన్నారు.   

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించారన్నారు.పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు  గణనీయంగా పెరగడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి, అలాగే తమ పిల్లలను చేర్పించి నిరంతరం సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు  కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.