25 July, 2026 | 12:58 AM

వాంగ్‌చుక్ దీక్ష విరమణ

25-07-2026 12:00 AM
  1. రాతపూర్వక హామీతోనే..:సోనమ్
  2. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో దీక్ష ముగింపు
  3. సోనమ్ వేగంగా కోలుకోవాలి
  4. ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్టు

న్యూఢిల్లీ, జూలై 24: పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇవ్వడంతో సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగుచుక్ తన నిరాహార దీక్షను విరమించారు. 26 రోజులుగా నిరాహార దీక్ష చేసిన ఆయన.. గురువారం అర్ధరాత్రి దాటాక కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో దీక్షను ముగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోనమ్ వాంగ్‌చుక్‌కు ప్రత్యేక సందేశం పంపారు.

ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటించి సోనమ్ వేగంగా కోలు కోవాలి. వీలైనంత త్వరగా ఆయన బరువు పెరగాలని కోరుకుంటున్నా. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థి స్తున్నా అని ప్రధాని తన ఎక్స్ పోస్ట్ చేశారు. దీక్ష విరమించిన అనంతరం సోనమ్ వాంగుక్ శుక్రవారం ఉదయం వీడియో విడుదల చేశారు. నీట్ పేపర్ లీకేజీ, పరీక్షా విధానంలో జవాబుదారీతనం, పరీక్షల్లో విస్తృత స్థాయి సంస్కరణలపై పార్లమెంట్లో చర్చిస్తామని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చిందని పేర్కొన్నరు.

శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై ఎలాంటి కేసులూ పెట్టబోమని కూడా  తెలిపిందని చెప్పారు. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిందని, అందుకే దీక్ష విరమిస్తున్నా అని సోనమ్ తన వీడియోలో తెలిపారు. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు.

‘సోనమ్జీ దీక్ష విరమించడం ఆనందంగా ఉంది. మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని మేల్కొలిపారు. మీ అసాధారణ ధైర్యం, త్యాగానికి కృతజ్ఞతలు సర్’ అని దీప్కే పేర్కొన్నారు. అయితే, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళన కొనసాగుతుందని దీప్కే స్పష్టం చేశారు.