29 August, 2026 | 6:22 PM

యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

29-08-2026 05:16 PM

హనుమకొండ, (విజయ క్రాంతి): శ్రీకృష్ణ జన్మాష్టమి నీ పురస్కరించుకొని సెప్టెంబర్ 4న హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

హనుమకొండ రాంనగర్ లోని బీసీ భవన్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను గొల్ల, కురుమలతో కలిసి సుందర్ రాజ్ యాదవ్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా అత్యంత వైభంగా కాళోజీ కళాక్షేత్రంలో ఉత్సవాలు జరుపుతామన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా  శ్రీకృష్ణుని భజనలు జరుగుతున్నాయని,  భగవద్గీత ప్రపంచానికే మార్గదర్శిగా మారిందని గుర్తు చేశారు. సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యాదవుల  సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.