క్రీడలు మానసిక ఉల్లాసానిస్తాయి
- ఉచిత క్రికెట్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
- గజ్వేల్ సీఐ రవికుమార్
గజ్వేల్,(విజయక్రాంతి): క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, క్రికెట్, తదితర క్రీడలు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని గజ్వేల్ సీఐ రవికుమార్ అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ మైదానంలో నిర్వహిస్తున్న ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గజ్వేల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, కార్యదర్శి బాకీ స్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నెల రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణ శిబిరంలో ఆసక్తి గల యువకులు పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్ మాట్లాడుతూ, యువత మొబైల్ ఫోన్లకు అధికంగా అలవాటు పడి అనారోగ్యాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పిస్తూ క్రీడల పట్ల ఆసక్తి పెంచాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో హరిప్రసాద్, బాకీ స్వామి ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, క్రీడలపై దృష్టి సారించి ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును కూడా కాపాడుకోవాలని సీఐ సూచించారు.






