30 July, 2026 | 3:49 AM

భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి

30-07-2026 12:00 AM

ఐటీడీఏ పీవో బి రాహుల్

భద్రాచలం టౌన్ ,జులై 29 (విజయక్రాంతి): రానున్న 36 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంత గిరిజనులందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి తమ పిల్లలను వాగులు వంకల వైపు వెళ్లకుండా చూడాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

వాతావరణ శాఖ అధికారుల సూచనల మేరకు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున గిరిజన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.గోదావరి వరద ముంపుకు గురి అయ్యే ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజన ప్రజలు, ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులను ముందస్తుగా అప్రమత్తంగా ఉంచాలని, భారీ వరద ప్రవాహ సమయంలో నదులు, కాలువలు, చెరువులు వంటి ప్రాంతాలకు వెళ్లకూడదని, వాటిని దాటేందుకు ప్రయత్నించ కుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

అలాగే రహదారులు, కల్వర్టులపై నీరు ప్రవహిస్తున్న చోట్ల వాటిని దాటడానికి సాహసించకూడదన్నారు. తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున గిరిజనులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కాచి వడబోసిన మంచినీటినే తాగాలని, పరిసరాల ముందు నిలువ నీరు ఉండకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిన సందర్భంలో ఆసుపత్రుల్లో అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.

ప్రసవం సమీపించిన గిరిజన గర్భిణీలను ముందుగానే ఆసుపత్రులు లేదా గర్భిణీల వసతి కేంద్రాలకు తరలించాలని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థుల పట్ల హెచ్‌ఎం వార్డెన్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పిల్లలు ఎవరు వారి ఇన్స్టిట్యూషన్ పరిధిలోని వాగులు వంకలకు వెళ్లకుండా చూడాలని ఇన్స్టిట్యూషన్లలో పరిశుభ్రత పాటించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.