గంజాయి నియంత్రణపై ప్రత్యేక దృష్టి
మహబూబాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): గంజాయి నియంత్రణ, రోడ్డు భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గూడూరు సీ ఐ వినయ్ కుమార్ కోరారు. కొత్తగూడ ఐజేయూ మండల కమిటీ ఆధ్వర్యంలో గూడూరు సీఐగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వినయ్ కుమార్ను జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ తన ప్రథమ ప్రాధాన్యతగా ఉంటుందని తెలిపారు.
అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని, ముఖ్యంగా గంజాయి వంటి మాదకద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, చట్టవ్యవస్థ పరిరక్షణలో మీడియా సహకారం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల పాత్రను అభినందిస్తూ, పోలీసు శాఖకు మీడియా కీలక భాగస్వాములన్నారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ మండల అధ్యక్షుడు షేక్ సల్మాన్ పాషా, జిల్లా నాయకులు పాలడుగు శ్రీధర్, జంగాల వినయ్ కుమార్, గోగు విజయ్ కుమార్, దేశి వెంకటేశ్వర్లు, బొజ్జ సునీల్, వాసం వెంకటేష్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.




