7 April, 2026 | 4:52 AM

యువత ఉద్యోగాలను సృష్టించాలి

07-04-2026 03:17 AM
  1. ధైర్యంగా ఉండండి.. పట్టుదలతో కలలను సాకారం చేసుకోండి
  2. ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవాలి
  3. కొలంబియా యూనివర్సిటీ ఫైర్‌సైడ్ చాట్‌లో  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): భారతీయ యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారీగా కాకుండా, పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికాలోని ప్రతిష్టా త్మక కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన ‘ఫైర్ సైడ్ చాట్’లో ఆయన సోమవారం ప్రసంగించారు.

భారత్ ఆర్థిక గమనం, కృత్రిమ మేధ(ఏఐ), వ్యవస్థాపకత, మారుతున్న ఉద్యోగ రంగాలపై తన లోతైన విశ్లేష ణలను విద్యార్థులతో పంచుకున్నారు. న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్ వార్షిక సదస్సు లో ప్రసంగించిన అనంతరం కేటీఆర్ ప్రత్యేక చర్చ గోష్టిలో పాల్గొన్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాలు, భారతదేశ ప్రగతి, నిరుద్యోగం, యువత, గెలుపోటముల వంటి అనేక అంశాల పైన తన అభిప్రాయాలను కేటీఆర్ పంచుకున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో భారత్ భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు.

3జీ, 4జీ, 5జీ వంటి టెలికాం సాంకేతికతలను భారత్ ప్రపంచ దేశాల కంటే ముందుగానే అందిపుచ్చుకుందని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు భారత్ ఒక కీలక దశలో ఉందని, ఇతర దేశాలభివృద్ధి నమూనాలను యథాతథంగా కాపీ కొట్టే పరిస్థితి లేదని, మనం సొంతంగా వినూత్నంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టంచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పెను మార్పులు తీసుకురాబోతోందని కేటీఆర్ హెచ్చరించారు. ఏఐ వల్ల రాబోయే రోజుల్లో మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు ప్రభావితమవుతాయని, ఈ ముప్పు వాస్తవం, చాలా దగ్గరలో ఉంద న్నారు.

ఈ మార్పును తట్టుకోవడానికి ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ ఇంకా సిద్ధంగా లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విప్లవాన్ని తట్టుకోవాలంటే యువత నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మలచుకోవాలని సూచించారు. తాజాగా ఒరాకిల్ సంస్థ భారీఎత్తున ఉద్యోగులను తొలగించిన అంశాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

స్టార్టప్ వ్యవస్థ గురించి మాట్లా డుతూ.. హైదరాబాద్‌ను ఒక ఉదాహరణగా కేటీఆర్ చూపారు. ఇంక్యుబేటర్లు, కో-వర్కింగ్ స్పేస్‌లు, మెంటార్ల ప్రోత్సాహం వల్లనే హైదరాబాద్ నుంచి అనేక ’యూనికార్న్’ సంస్థలు పుట్టుకొచ్చాయని వివరిం చారు. దేశంలో వ్యవస్థాపకత పెరగాలంటే కేవలం పథకాలు ఉంటే సరిపోదని, ఒక పటిష్టమైన ‘ఎకో సిస్టమ్’ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

భారతదేశంలో ఉన్న యువ జనాభా ఒక శక్తి అని, అయితే అదే సమయంలో అది ఒక సవాలు అని కేటీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే కేవలం అవకాశాలు కల్పిస్తే సరిపోదని, సరైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయాలని చెప్పారు.

మౌలిక సదుపాయాలు, క్లీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పబ్లిక్ ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులు, మేధావులు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేటీఆర్ పలు అంశాల పైన చెప్పిన అభిప్రాయాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.