7 April, 2026 | 1:58 AM

పెద్దవాగులో ఇసుక రాబందులు

07-04-2026 12:00 AM
  1. వాల్ట చట్టానికి తూట్లు

ఖజానాకు కన్నం.. చెక్ డ్యామ్‌కు దహనం..

కళ్ళు మూసుకుని జేబులు నింపుకుంటున్న అధికారులు ?

అడుగంటుతున్న భూగర్భ జలాలు 

నంగునూరులో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా

సిద్దిపేట, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలోని మోయతుమ్మెద వాగులు ఇసుక రాబందుల పాలవుతున్నాయి.అధికారుల ఉదాసీనత, పాలకుల నిర్లక్ష్యం తోడవ్వడంతో ఇసుక మాఫియా బరితెగించి ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేస్తోంది. అక్రమ రవాణాకు అడ్డుగా ఉన్నాయని కోట్లాది రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామ్లను కూల్చివేస్తూ,నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వంతెనలు, చెక్ డ్యామ్లకు వంద మీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు జరపకూడదు. కానీ, సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి, నంగునూరు మండలం ఖాతా,ఘణపూర్,అక్కెనపల్లి గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యామ్లను ఇసుక మాఫియా లక్ష్యంగా చేసుకుంది. ఇసుక తరలించే ట్రాక్టర్లు, జేసీబీలు వాగులోకి వెళ్లేందుకు వీలుగా రాతి కట్టడాలను (గోడలను) ధ్వంసం చేసి దారి నిర్మించుకున్నారంటే వారి తెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ముడుపుల మత్తులో యంత్రాంగం?

ఇసుక అక్రమ రవాణా దర్జాగా సాగుతున్నా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ’నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ నుంచి నెలకు రూ. 20,000 నుండి రూ. 30,000 వరకు వసూలు చేసి అధికారులకు మూడు వాయిదాల్లో ముట్టజెపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టాస్క్ఫోర్స్ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నా, అవి కేవలం ప్రదర్శనకే పరిమితమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు కన్నీరు.. ఎండుతున్న పంటలు

వాగుల నుంచి అడ్డూఅదుపు లేకుండా ఇసుక తోడేయడంతో పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లుతోంది.ఇసుక పొరలు మాయమవడంతో భూగర్భ జలమట్టం అడుగుతుంటుందని,వాగు పరీవాహక ప్రాంతాల్లోని బోరుబావుల్లో నీరు రాక వరి పొలాలు పొట్ట దశలో ఎండిపోతున్నాయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ట్రాక్టర్ల దారి కోసం పంట పొలాలను ధ్వంసం చేస్తున్నారని,ఎదురు తిరిగిన రైతులకు డబ్బు ఆశ చూపడం లేదా బెదిరింపులకు దిగడం మాఫియాకు పరిపాటిగా చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గ్రామస్తుల ఆగ్రహం

ఇటీవల జాలపల్లి, ఖాతా గ్రామస్తులు ఏకమై అక్రమ రవాణాకు వేసిన రోడ్డును జేసీబీతో తొలగించి తమ నిరసనను వ్యక్తం చేశారు.పోలీసులకు ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదని,ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, చెక్ డ్యామ్లను కాపాడాలని బాధితులు కోరుతున్నారు.